ఆగ‌నంటున్న ఆనం!

నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం సోదరుల ప‌రిస్థితి ప్ర‌స్తుతం అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. అధికార పార్టీలో ఉంటున్నా..ఏ ఒక్క ప‌ని జ‌ర‌గ‌క‌పోవ‌డంతో క్యాడ‌ర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్ర‌మంలో పార్టీ మారాల‌ని ఆనం వర్గీయులు ఒత్తిడి పెంచ‌డంతో ఇక సైకిల్ దిగి ఫ్యాన్ కింద‌కు వ‌చ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ఆర్థిక మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం టీడీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన అనుచరులకు ఆయన సంకేతాలు ఇచ్చారు.

ఆనం వివేకానంద రెడ్డి మరణం తర్వాత రామనారాయణ రెడ్డి కొంత ఊగిసలాట ధోరణిలో ఉన్నారు. తమకు టీడీపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని కినుక వహించారు. దీంతో ఆయన టీడీపీని వీడనున్నారనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు వైసీపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. వీటికి తోడు టీడీపీ పండుగలా భావించే మహానాడుకు సైతం ఆయన డుమ్మా కొట్టడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది.

తాజాగా ఆత్మకూరు నియోజకర్గంలోని ముఖ్య నేతలతో రామనారాయణ రెడ్డి నిన్న‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీలో ఇంక ఉండలేనని, వీడాలని నిర్ణయించుకొన్నట్లు వారికి వివరించారు. అందుకు దారి తీసిన పరిస్థితులను కూడా వారికి తెలియజేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని నాయకులకు తేల్చి చెప్పారు. అలాగే ఏ పార్టీలో, ఎప్పుడు ఎలా చేరాలనే విషయంపై జూన్ 20 న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తానని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో మాట్లాడి వారి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ఆనం పార్టీ మారుతున్నట్టు జరుగుతోన్న ప్రచారం ఓ కొలిక్కి వచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జ‌రిగితే నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ గండి ప‌డే అవ‌కాశం ఉంది.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *