జీఎస్ఎల్‌వీ మార్క్ 3 డీ2 ప్ర‌యోగం విజ‌య‌వంతం

ఏపీ టాప్ న్యూస్‌: భారత అత్యంత శక్తివంతమైన రాకెట్ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి మార్క్‌3 డీ2 గగనానికి దూసుకెళ్లింది. అనుకున్న సమయం ప్రకారమే ఈ రోజు సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ2 వాహక నౌకను షార్ ప్రయోగించింది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభమైంది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ2 వాహక నౌక కమ్యూనికేషన్‌కు సంబంధించిన జీశాట్‌-29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లింది.

జీశాట్-29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టింది. 3.423 కిలోల బరువు గల జీశాట్-29 ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి తీసుకెళ్లింది. 10ఏళ్ల పాటు జీశాట్-29 ఉపగ్రహం సేవలందించనుంది. ఈ ఉపగ్రహం సాయంతో మారుమూల ప్రాంతాల్లో ప్రజల సమాచార అవసరాలను తీర్చవచ్చునని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. జీశాట్-29 ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ శివన్ అభినందించారు.

Share