హోలీ.. రంగుల కేళీ

ఏపీ టాప్ న్యూస్‌: హోలీ పండుగ ఎందుకు వ‌చ్చింది? ఎందుకు జ‌రుపుకుంటారు? తెలుసుకోవాలంటే పురాణాల్లోని ప్ర‌హ్లాదుని క‌థ‌లోకి వెళ్లాల్సిందే.. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడి విష్ణు భక్తి మాన్పించాలని అతనిని అనేక విధాల శిక్షిస్తాడు. అతను హరి భక్తిని వీడకపోయేసరికి చివరికి కన్న కొడుకనయినా చూడకుండా చంపించాలనికూడా అనేక ప్రయత్నాలు చేస్తాడు. అయినా ప్రహ్లాదుడు విష్ణు భక్తి మానలేదు. ఆ మహావిష్ణువు సహాయంతో తండ్రి పెట్టే అన్ని విషమ పరీక్షలనుంచి క్షేమంగా బయటపడ్డాడు. విసిగిపోయిన హిరణ్యకశిపుడు తన చెల్లెలు అయిన హోలికను ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చితిలో కూర్చోమన్నాడు. ప్రహ్లాదుడు మంటల్లోంచి భయపడి బయటకి పోకుండా హోలిక పట్టుకు కూర్చోవాలన్నమాట. ఆవిడ అన్నగారి ఆదేశం ప్రకారం మంటలనుంచి రక్షించే శక్తి వున్న ఒక శాలువా కప్పుకుని, ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుంది.

ప్రహ్లాదుడు హరి నామ స్మరణతో నిర్భయంగా కూర్చున్నాడు. అందరూ ప్రహ్లాదుడు చనిపోతాడని భావించారు. మంటలు మొదలయ్యాయి. అందరూ చూస్తుండగానే హోలిక కప్పుకున్న శాలువా ఎగిరి ప్రహ్లాదుడిని కప్పింది. దాని వలన ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు, హోలిక మంటల్లో కాలి మరణించింది. తర్వాత శ్రీ మహావిష్ణువు నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపుతాడు. హోలిక మంటల్లో కాలిపోయిన రోజున హోలికా దహన్ అని వీధుల కూడళ్ళల్లో కఱ్ఱలు వగైరాలతో మంటలు వేస్తారు. కొన్ని చోట్ల హోలిక బొమ్మని కూడా తగలబెడతారు. దక్షిణాదిన ఈ పున్నమిని కాముని పున్నమి అని, ఈ మంటలని కాముని దహనం అంటారు. మరి దానికి సంబంధించిన కధ తెలుసుకోవాలికదా. పార్వతీ దేవి పరమ శివుణ్ణి భర్తగా పొందాలనుకుంటుంది. ఆ మహా శివుడేమో తన తపస్సేమిటో, తన సంగతేమిటో తప్ప పార్వతీ దేవిని పట్టించుకోలేదు. మన్మధుడు లోక కళ్యాణార్ధం (తారకాసురుడనే రాక్షసుణ్ణి చంపటానికి పార్వతీ పరమేశ్వరులకి పుత్ర సంతానం కలగాలి) పార్వతీ దేవికి సహాయం చేద్దామనుకుంటాడు. తన పూల భాణాలు శివుడిమీద ప్రయోగిస్తాడు. తపస్సు చేసుకునే శివుడు కోపంతో తన మూడో కన్న తెరుస్తాడు. పాపం మన్మధుడు భస్మమవుతాడు.

రతీదేవి తన భర్తని తిరిగి బ్రతికించమని శివుణ్ణి పరిపరి విధాల ప్రార్ధిస్తుంది. శివుడు కనికరించి మన్మధుణ్ణి బ్రతికిస్తాడుగానీ భౌతిక ప్రేమకన్నా గొప్పదైన ఆధ్యాత్మక ప్రేమ విశిష్టతను లోకానికి తెలియజేయటానికి మన్మధుడు కేవలం రతీదేవికి మాత్రమే కనబడేటట్లు అనుగ్రహిస్తాడు. భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి, ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం పేరుతో మంటలు వేస్తారు. శ్రీ కృష్ణుడు పుట్టి, పెరిగిన మధుర, బృందావనం వగైరా ప్రదేశాలలో ఈ పండగ చాలా ఉత్సాహంగా, గొప్పగా జరుపుకుంటారు. 16 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో ఆ ప్రదేశాలన్నీ పర్యాటకులతో కళకళలాడుతూంటాయి. చిన్ని కృష్ణుడు తన తల్లితో రాధ తెల్లగా వుందని తను నల్లగా ఎందుకున్నాననీ ఫిర్యాదు చేశాడట. కొడుకుని నవ్వించటానికి తల్లి రాధ మొహానికి రంగు పూసిందని, అప్పటినుంచీ హోలీ ప్రారంభమయిందనీ వారి విశ్వాసం. కృష్ణుడు, రాధ, గోపికలు ఆనాడు బృందావనంలో ఈ ఉత్సవాల్ని జరుపుకున్నారని భావిస్తారు. అందుకే ఉయ్యాలలో రాధా కృష్ణుల విగ్రహాలుంచి ఊపుతూ డోలోత్సవం అని చేస్తారు.

వసంత కాలంలో జరిగే వాతావరణ మార్పులవలన జలుబు, జ్వరాలు త్వరగా వస్తాయి. వాటి నివారణకోసే ఇదివరకు నిమ్మ, కుంకుమ, పసుపు, బిల్వ, మోదుగ మొదలకు వృక్ష భాగాలనుంచి తయారు చేసిన రంగుల పొడిన జల్లుకునేవారు, వాటిని నీటిలో కలిపి ఒకరిమీద ఒకరు జల్లుకునేవారు. వాటివల్ల ఆరోగ్యం మెరుగుపడేది. కానీ ఇప్పుడు వాడుతున్న రసాయనిక రంగులవల్ల లేనిపోని అనారోగ్యాలు వచ్చే అనకాశం వున్నది. భారత దేశంలోనే కాక కొన్ని విదేశాలలో కూడా జరుపుకునే ఈ పండగలో ప్రాంతాలు వేరయినా, పేర్లు వేరయినా, జరుపుకునే పధ్ధతులు వేరయినా ఉద్దేశ్యంమాత్రం ఒక్కటే. చలికాలం వెళ్ళి వేసవి వచ్చే వేళలో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే వేడుకే హోలీ. వసంతుని రాకతో పులకరించిన ప్రకృతిని చూసిన మనుషుల్లో అనేక వికారాలు ఉద్భవిస్తాయి. భౌతికమైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను విజ్ఞానమనే మంటల్లో తగలబెట్టి మంచి జీవితం గడపటమే ఈ పండగ ముఖ్యోద్దేశ్యం. హోలీ రోజున జల్లుకునే రసాయనాలు లేని రంగులు శరీరాన్ని చల్లబరుస్తాయి. తర్వాత చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తింటారు.

ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది ఈ పండుగ. డోలా పూర్ణిమ అని కూడా పిలవబడే ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ నారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం వగైరా వ్రతాలు కూడా చేస్తారు. తెలుగునాట పల్లెటూళ్ళల్లో అంత ఎక్కువ లేకపోయినా, పట్టణాలలో హోలీ ఉత్సాహాన్ని చూస్తూనే వుంటాము. ముగించే ముందు నేను చూసిన విశేషం ఒకటి చెబుతాను. అస్సాం రాష్ట్రంలో వైష్ణవ మందిరాలలో ఆవరణలోనే ఆలయం ఎదురుగా చిన్న మందిరం వుంటుంది. డోల్ మందిర్ అంటారు దానిని. హోలీ రోజున అక్కడ కృష్ణ విగ్రహాన్ని పెట్టి అందరూ నృత్యాలు చేస్తూ, రంగులు జల్లుకుంటూ గొప్ప ఉత్సవం చేస్తారుట.

Share