త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌?

ఏపీ టాప్ న్యూస్ : తెలుగుదేశం పార్టీలో త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌బోతోంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. తాజాగా చంద్ర‌బాబు ముస్లింల‌కు మంత్రిప‌ద‌వి ఇస్తామ‌ని చేసిన ప్ర‌క‌ట‌న కూడా అందుకు బ‌లం చేకూరుస్తోంది. 2019 ఎన్నిక‌ల‌కు ఏడాది కూడా లేక‌పోవ‌డం, ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత బీజేపీ మంత్రులు వారి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డంతో అతి త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టి ఖాళీగా ఉన్న ఆ రెండు బెర్తుల‌తో పాటు మ‌రికొంద‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌నే యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ని టీడీపీ సీనియ‌ర్లు అంటున్నారు.
కాగా నాలుగున్న‌రేళ్ల‌యినా ఏపీ కేబినెట్‌లో ఒక్క‌రు కూడా మైనార్టీ మంత్రి లేక‌పోవ‌డంతో టీడీపీపై మైనార్టీలు ఒకింత కోపంతో ఉన్నార‌ని, వాళ్ల‌ను శాంత ప‌ర‌చ‌డంతో పాటు ఇప్పుడు బీజేపీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, మైనార్టీ వ్య‌క్తికి కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తే ముస్లింలు టీడీపీ వైపు వ‌స్తార‌నే ఆలోచ‌న‌లో కూడా చంద్ర‌బాబు ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా ఈసారి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ కు మంత్రి ప‌ద‌వి ఖాయం అని కొంద‌రు అంటుంటే.. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్‌పాషా పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. బాబు మ‌దిలో ఏముందో తెలుసుకోవాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

Share