బాబు..నా ప్ర‌మాణ స్వీకారానికి రండి

ఏపీ టాప్ న్యూస్‌: నిశ్చ‌య ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. ఈ నెల 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వైయ‌స్ జ‌గ‌న్.. బాబును ఆహ్వానించారు. ఈ నెల 30న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 12.23 నిమిషాలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని.. మీరు కూడా హాజరు కావాలని జగన్ కోరినట్లుగా స‌మాచారం. ఇప్పటికే ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను జగన్ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం తెలిసిందే. తాజాగా బాబును కూడా ఆహ్వానించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైయ‌స్ జ‌గ‌న్‌తో సుబ్ర‌హ్మ‌ణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అయ్యారు. తన ప్రమాణ స్వీకారంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు, వివిధ శాఖల స్థితిగతులపై వైయ‌స్ జగన్ చర్చించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైయ‌స్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ భేటీలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ట్రాఫిక్ డీసీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే జగన్ తన ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్.. ఈ నెల 29న విజయవాడకు వెళ్లనున్నారు.

Share