ఏపీ డీజీపీగా గౌత‌మ్ స‌వాంగ్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతారు. గురువారం నలుగురు ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించిన రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. మరోవైపు ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేసి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో కమిషనర్‌గా ఉన్న త్రిపాఠిని జీఏడీగా బదిలీ చేశారు. మరోవైపు ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు కూడా స్థానచలనం కలిగింది. ఆయన్ను జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. వెంకటేశ్వరరావు స్థానంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక గౌతమ్ సవాంగ్ విషాయానికి వస్తే.. ఆయన అస్సాంకు చెందిన వారు.
అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, లక్ష్యద్వీప్, త్రిపుర, ఢిల్లీలో ఆయన ప్రాథమిక విద్యను అభ్యసించారు. చెన్నై లయోలా కాలేజీలో గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ పట్టా పొందారు. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఏపీ కేడర్ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో ఏఎస్పీగా సవాంగ్ ప్రస్థానం మొదలైంది. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ అణచివేతలో కీలకపాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ విభాగం ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. 2016లో ఆయనకు డీజీగా పదోన్నతి లభించింది.

Share