క‌మ‌లం పార్టీలోకి సైకిల్ పార్టీ నేత‌లు?

ఏపీ టాప్ న్యూస్‌: భారతీయ జనతా పార్టీ తను బలోపేతం కావడం కోసం తెలుగుదేశం పార్టీని వాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జీరో అయ్యింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తగిన ఎదురుదెబ్బతో తెలుగుదేశం అక్కడ తోక ముడిచింది. అంతకు ముందే పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. నామమాత్రంగా కొందరు పోటీ అయితే చేశారు. అయితే అంతా చిత్తుగా ఓడారు. అయితే కొంతమంది పాత నేతలు మాత్రం అలాగే తెలుగుదేశం పార్టీలో మిగిలారు. ఇప్పుడు వారు భారతీయ జనతా పార్టీ లోకి చేరే ప్రయత్నంలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కిషన్ రెడ్డిని పట్టుకుని కొందరు తెలంగాణ తెలుగుదేశం నేతలు బీజేపీలోకి చేరే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఆ సంగతలా ఉంటే ఏపీలో కూడా అలాంటి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయని సమాచారం. భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ఏపీలో తెలుగుదేశం నేతలు ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు ఈ విషయంలో ముందున్నారట.

జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్లు ఇప్పటికే బీజేపీతో సంప్రదింపులు మొదలుపెట్టారని.. వారు జూన్ రెండో వారంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే తెలుగుదేశం నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని వంటి వారు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా సమాచారం. ఇలా తెలంగాణలో పూర్తిగా చెక్ పెట్టడంతో పాటు ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలే సాగిస్తున్నట్టుగా ఉంది!

Share