ఒక‌టొక‌టిగా ప‌థ‌కాల అమ‌లు

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఒక్కో ప‌థ‌కాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు. వైయ‌స్ పింఛ‌న్ ప‌థ‌కం అమ‌లు చేస్తున్నారు. నెలకు 2250 రూపాయల చొప్పున పింఛన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అలాగే వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా పధకం కింద ఏడాదికి రూ.12500లు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. అలాగే 4వేల రూపాయల సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నారు. వీటితో పాటు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లను నియమిస్తున్న సంగతి తెలిసిందనే. ఇలా వరుసగా పధకాలు ప్రకటిస్తూ అమలు చేస్తూ దూసుకుపోతున్న జగన్, రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప‌థ‌కం ద్వారా చదువు మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల‌కు వెళ్లే పిల్లలకు అమ్మఒడి ప‌థ‌కం కింద 15 వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ప‌థ‌కం తక్షణమే అమలులోకి వచ్చినా.. జనవరి 26 వ తేదీన అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం ప్రకటించిన 15వేల రూపాయలను ప్రభుత్వం వారి తల్లిదండ్రులకు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ దందాను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నారాయణ వంటి విద్యాసంస్థలు ప్రీ స్కూల్ స్టేజిలోనే 20 వేల రూపాయల ఫీజును వసూళ్లు చేస్తున్నారట. వీటి దందాను అడ్డుకొని, ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రవేశ పెట్టిన ఈ పథకం హిట్టయితే.. భవిష్యత్తులో జగన్ కు తిరుగుండదు అనడంలో సందేహం లేదు.

Share