అర్హులంద‌రికీ సంక్షేమ ఫ‌లాలు

ఏపీ టాప్ న్యూస్‌: ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు ఓటు వేస్తారని ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్ చెప్పారు. ప్రజలకు మంచి పనులు చేస్తే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తోందన్నారు. సోమవారం నాడు అమరావతిలో కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్ ప్రసంగించారు. ఎన్నికల వరకే రాజకీయాలు… ఎన్నికల తర్వాత అభివృద్ది గురించే చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా చేరేందుకు వీలుగా గ్రామ వలంటీర్లను నియమిస్తున్నట్టుగా జగన్ చెప్పారు ప్రతి రెండు వేల కుటుంబాలు ఉన్న గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ వలంటీర్లు రాగద్వేషాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేర్చాలన్నారు. ఒకవేళ వలంటీర్లు అవినీతికి పాల్పడితే వెంటనే అతడి స్థానంలో మరోకరిని నియమిస్తామన్నారు.
తమ పార్టీకి ఓటు వేయని వారికి కూడ అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడ ప్రభుత్వ పథకాలు అందజేయాలని సీఎం ఆదేశించారు.గ్రామస్థాయి నుండి సీఎం స్థాయి వరకు పాలనలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగితే పనులు అయ్యే పరిస్థితిలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.లంచాలు ఇస్తేనే పనులు చేసే పరిస్థితులు ఇక ఉండకూడదని జగన్ సూచించారు.

Share