త్వ‌ర‌లో ర‌చ్చ‌బండ

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ నూతన ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైయ‌స్ జగన్… తన పాలనలో త‌న తండ్రి దివంగ‌త నేత మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయ‌స్ఆర్ ఉన్న సమయంలో ఆయన ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం పెట్టారు. కాగా… ఇప్పుడు తండ్రి బాటలో జగన్ కూడా రచ్చ బండ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని తాను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. సోమవారం నాడు కలెక్టర్లతో జరిగిన సదస్సులో సీఎం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్తానని ఈ సందర్భంగా జగన్ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్లు, అధికారులకు వైయ‌స్‌ జగన్ పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ డే జరపాలన్నారు. స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని.. సోమవారం రోజు ఎలాంటి మీటింగ్‌లు పెట్టుకోవద్దని సూచించారు. గ్రీవెన్స్‌సెల్‌కు ఎవరొచ్చినా ఒక రిసిఫ్ట్‌ ఇవ్వండి, ఫోన్‌ నెంబర్‌ తీసుకోవాలని.. మీ సమస్యను ఇన్నిరోజుల్లో పరిష్కరిస్తానని చెప్పాలన్నారు. వారానికి ఒక్కరోజు గ్రామాల్లో రాత్రి బస చేయాలన్నారు. రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారాలన్నారు. విద్య, వైద్యం, రైతులే మా ప్రధాన అజెండా అని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Share