వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎన్నిక‌ల చెల్ల‌దా?

ఏపీ టాప్ న్యూస్‌: గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కి షాక్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. వంశీమోహన్ ఎన్నిక రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల అఫిడవిట్ లో కేసుల వివరాలు దాచిపెట్టారని తప్పులు తడకలతో అఫిడవిట్ సమర్పించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపులపాడు మండలం కనుమోలులో పర్యటించిన వంశీ నకిలీ ఇళ్ల పట్టాలు అందజేశారని ఆరోపించారు. ఓటర్లకు ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్లపట్టాలు ఇచ్చి లబ్ధి పొందారని ఆరోపించారు. ఈ అంశంపై హనుమాన్ జంక్షన్ పీఎస్ లో కేసు కూడా నమోదైందని ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు. ఈ విషయాన్ని వంశీ అఫిడవిట్ లో పొందుపరచలేదన్నారు.
అలాగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలోనూ వంశీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. వంశీమోహన్ ఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో అనర్హత పిటీషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక రద్దు చేసి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కోరారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్లు దాఖలు చేశారు వైసీపీ అభ్యర్థులు. మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప, కరణం బలరాం, మాజీమంత్రి అచ్చెన్నాయుడులపై అనర్హత పిటీషన్లు దాఖలు చేశారు. తాజాగా వల్లభనేని వంశీమోహన్ పై కూడా పిటీషన్ దాఖలు చేశారు యార్లగడ్డ. కరణం బలరాం సంతానం విషయంలో కోర్టును ఆశ్రయిస్తే మిగిలిన వారిపై మాత్రం కేసుల గురించి ప్రస్తావిస్తూ హైకోర్టను ఆశ్రయించారు ఆయా నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు.

Share