అలా చేస్తే ఓ ప‌నైపోతుంది!

ఏపీ టాప్ న్యూస్‌: తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రూ ఊహించని విధంగా స్పందించారు. చంద్ర‌బాబు నాయుడికి దిమ్మ‌తిరిగేలా చేశారు. ఇంత‌కీ జేపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఏం చేశార‌నేగా అయితే వివ‌రాల్లోకి వెళ్దాం.. మ‌న దేశంలో ఇప్పుడు పార్టీల విలీనాలు న‌డుస్తున్నాయ‌ని, టీడీపీని బీజేపీతో విలీనం చేస్తే ఓ పని అయిపోతుందనేశారు. ఆయన చాలా సులువుగా ఈ మాట చెప్పినా పసుపు పార్టీ తమ్ముళ్లకు మాత్రం ఎక్కడో కలుక్కుమంటోంది. దాదాపుగా నాలుగు దశాబ్దాల పార్టీ టీడీపీని ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీలో విలీనం చేయడమా అని భగ్గుమంటున్నారు.ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఏపీలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేల పక్క చూపులు భరించలేక చిరంజీవి గౌరవంగా తానే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లుగా చెప్పుకుని కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నారు. ఇపుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఏమంత గొప్పగాలేదు. ఏపీ అసెంబ్లీలో పేరుకు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒకరిద్దరు తప్ప నోరు విప్పిన వారు లేరు.
అసలు సభకు వచ్చిన వారు కూడా లేరు. ఇక మిగిలిన వారిలో అనేకమంది సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. కొందరు గోడ దూకడానికి టైం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా జారిపోతున్న వారిని ఒక గాటకు కట్టి నడిపించడం బాబుకు కష్టసాధ్యమైన విషయమే. మరో వైపు బీజేపీ కూడా పొంచిఉంది. వీలైనంత మందిని తీసేసుకుని బీజేపీలోకి తమ్ముళ్ళు విలీనం అయ్యారని చెప్పుకోవడానికి ఆ పార్టీ ఆరాటపడుతోంది. అందువల్ల ఎటువంటి చికాకులు లేకుండా ఉండాలంటే అధినాయకుడే విలీనం ప్రతిపాదన చేస్తే మంచిదని జేసీ బ్రదర్ ప్రభాక‌రరెడ్డి అంటున్నారు.

Share