రూ.100 కోట్లు దాటితే న్యాయ‌స‌మీక్ష‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. ప్రభుత్వం చేపట్టే పనుల్లో పారదర్శకత కోసం రూపొందించిన ఏపీ మౌలికసదుపాయాల చట్టం 2019కు ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం రూ.100 కోట్లకు పైబడిన పనులకు సంబంధించిన టెండర్లను జ్యుడీషియల్ సమీక్ష ద్వారా కేటాయిస్తారు. ఈ బిల్లు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల పనుల్లో పారదర్శకతకు ఉద్దేశించిన ‘ముందస్తు న్యాయ సమీక్ష’ అనే బీజం మహా వృక్షమై, దేశానికి దిశ-దశ అవుతుందని, అంతర్జాతీయ సమాజానికి ఓ సందేశం వెళ్తుందని వ్యాఖ్యానించారు. రూ.100 కోట్లు, ఆపైన ఏ టెండర్లనైనా న్యాయమూర్తి వద్దకు సమీక్షకు పంపనున్నట్టు తెలిపారు. ఓ పని మూడు నాలుగు భాగాలుగా కలిపి రూ.100 కోట్లు అయితే దానిని కూడా సమీక్షకు పంపుతామని, ఇందు కోసం ఓ న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారని సీఎం తెలిపారు. కొత్త చట్టం ప్రకారం.. న్యాయమూర్తి వద్దరకు వెళ్లిన టెండరు పత్రాలను ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతారు.
ఆ వివరాలు సోషల్ మీడియాలో ఉంచి, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాంకేతిక అంశాల పరిశీలనకు కూడా ప్రభుత్వం తరఫున ఓ సాంకేతిక బృందం ఉంటుంది. వీళ్లు కాకుండా ఇతరులు కావాలని న్యాయమూర్తి అడిగితే వారినీ ఇస్తారు. దీనికయ్యే ఖర్చును మొత్తం ప్రభుత్వమే భరించనుంది. న్యాయమూర్తి ఏది సరైంది అనుకుంటారో ఆ మేరకు మార్పులు, చేర్పులకు ఆదేశాలిస్తారు. మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే ప్రభుత్వం టెండర్ పిలుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు రెండు వారాల సమయం పడుతుంది. దీని వల్ల టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతాయని సీఎంజగన్‌ తెలిపారు. లోకాయుక్త సవరణ బిల్లును కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత అయిదేళ్లలో రాష్ట్రంలో లోకాయుక్త ఎందుకు లేదనేది ప్రశ్నార్థకమేనని అన్నారు. లోకాయుక్తను నిజంగా తీసుకురావాలనుకుంటే సాధ్యమయ్యేదని వ్యాఖ్యానించారు.
లోకాయుక్తలో ప్రస్తుత న్యాయమూర్తి గాని, హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి గానీ ఉండాలనే నిబంధనను మార్చితే రాష్ట్రంలో లోకాయుక్త వచ్చేదన్నారు. అలా చేయకుండా ఐదేళ్లు పెండింగ్‌లో పెట్టారని, తాము అధికారం చేపట్టిన 45 రోజుల్లోనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగన్ పేర్కొన్నారు. మార్కెట్‌ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను గౌరవ ఛైర్మన్లుగా నియమించే బిల్లుకు కూడా సభ ఆమోదం లభించింది. ఈ బిల్లు వల్ల మార్కెట్‌ యార్డు పరిధిలో జరిగే సమావేశంలో రైతులు తమ సమస్యలను తెలియజేయవచ్చు. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా? లేదా? అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియనుంది. రైతులకు సకాలంలో గిట్టుబాటు ధర రాకపోతే వారు నష్టపోతారనే ఉద్దేశంతో దీనిని అధిగమించేందుకే ఎమ్మెల్యేలను గౌరవ ఛైర్మన్లగా నియమించనున్నారు. రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి నుంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వీలుంటుందని సీఎం జగన్ వివరించారు.

Share