మీ బోధ‌న‌లు మాకు స్ఫూర్తి

ఏపీ టాప్ న్యూస్‌: భారత మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. దేశానికి కలాం చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు కామెంట్లు పెట్టారు. శనివారం (జులై 27) కలాం వర్ధంతి సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి.. ఆయనకు నివాళి అర్పించారు. కలాం భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన బోధనలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా వినయపూర్వక నివాళి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. కలాం బోధనలు మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అబ్దుల్ కలాం 2015 జులై 27న కన్నుమూశారు. షిల్లాంగ్‌లోని ఐఐఎంలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయణ్ని హుటాహుటిన మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా.. ఫలితం లేకుండాపోయింది. తన చిట్టచివరి నిమిషంలోనూ యువతలో స్ఫూర్తి రగిలిస్తూనే నేలకొరిగారు ఈ ధాత్రి ప్రియపుత్రులు.

Share