పోల‌వ‌రం ప‌నుల‌పై రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు వెళ్తాం

ఏపీ టాప్ న్యూస్‌: పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లబోతున్నామని.. అసెంబ్లీలో అధికారికంగా ఏపీ సర్కార్ ప్రకటిచింది. పోలవరంపై నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని…ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిబంధనలు ఉల్లంఘించారని నిపుణుల కమిటీ తేల్చిందని ప్రభుత్వం సభకు తెలిపింది. వివిధ ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లకు లాభం కలిగేలా చర్యలు తీసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా మట్టిపని పరిమాణాలను పెంచేశారని కమిటీ వివరించింది. జలవనరులశాఖ నాణ్యత నియంత్రణ విభాగం సరిగా పనిచేయడం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడయినట్లు తెలిపింది. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోగా.. ఒప్పందానికి విరుద్ధంగా ధరలు పెంచేశారని నివేదికలో నిపుణల కమిటీ తెలిపింది. అంతేకాదు.. పనులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని కమిటీ సిఫార్స్ చేసింది. ఈ సిఫార్స్‌కు అనుగుణంగా.. రివర్స్ టెండరింగ్ కు వెళ్లనున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటిచింది. కేంద్ర జలశక్తి సంస్థ అనుమతి రాగానే.. ఈ పని చేపడతామని ప్రకటించింది.
పోలవరంలో రూ. 6,500 కోట్ల పనులను రివర్స్ టెండరింగ్ ద్వారా చేపడితే.. రూ. 1500 కోట్లు ఆదా అవుతాయని అధికారపక్షం అంచనా వేసింది. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం.. జ్యూడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలనుకున్న సర్కార్ ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదించింది. రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతి ద్వారా చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడీని, అవినీతిని కూడా వెలికితీయబోతున్నామని సభ్యులు ప్రకటించారు. ప్రజాధనాన్ని కైంకర్యం చేయకుండా జ్యుడిషియల్‌ కమిషన్‌ బిల్లు చరమగీతం పాడతుందన్నారు. వందకోట్లకు మించి ఉన్న ఏ ప్రాజెక్టు అయినా, పని అయినా న్యాయమూర్తి ఆధ్వర్యంలో టెండర్ల పరిశీలన జరుగుతుందని, అంతేకాకుండా వారం రోజులపాట టెండర్ల అంశం ప్రజల మధ్య ఉంటుందని, టెండర్లకు సంబంధించిన ప్రతి అంశం ప్రజల ముందుకు వస్తుందని చర్చలో సభ్యులు తెలిపారు.
అలాగే… ఏపీలో ఉన్న మర్కెట్ కమిటీలన్నింటికీ… ఎమ్మెల్యేలనే చైర్మన్ గా నియమిస్తూ.. మార్కెటింగ్ చట్టానికి సవరణ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు కల్పించడంలో కీలకమైన మార్కెటింగ్‌ శాఖ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గంలోని మార్కెట్‌ యార్డుల్లో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా లేదా అన్నది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సులభంగా తెలుస్తుందని జగన్ అన్నారు అలా తెలిసిన వెంటనే..ప్రభుత్వం దృష్టికి, నా దృష్టికి తీసుకువస్తే.. ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని, రూ. మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని, ఆ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని జగన్ ప్రకటించారు.

Share