`ఏం చేస్తారో చేసుకోండ‌ని చెప్పాను`

ఏపీ టాప్ న్యూస్‌: బాబ్లీ ప్రాజెక్ట్ వ్యవహారంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై చంద్ర‌బాబు స్పందించారు. శ్రీ‌శైలం ప్రాజెక్టు ద‌గ్గ‌ర జ‌ల‌సిరికి హార‌తి ఇచ్చే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన బాబు నోటీసులపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టు వ‌ద్ద ధ‌ర్నా చేసిన దానికి ఈ రోజు నోటీసులు పంపించామ‌ని అంటున్నార‌ని, కానీ తాను నాడే బాబ్లీ ప్రాజెక్టు ఎత్తును పెంచితే ఊరుకునేది లేదు అని, ఏం చేస్తారో చేసుకోండి అంటూ పోలీసుల‌కు చెప్పాన‌న్నారు. తాను ఏ నేరం చేయ‌లేద‌ని, అన్యాయం అస్స‌లే చేయ‌లేదంటూ చెప్పుకొచ్చారు. ఉత్త‌ర తెలంగాణ ఎడారి కాకూడ‌ద‌ని పోరాటాం చేశాన‌న్నారు. నోటీసుల‌తో త‌న‌ను భ‌య‌పెట్టాల‌ని చూస్తున్నార‌ని, తాను భ‌య‌ప‌డే ర‌కం కాద‌ని అన్నారు. కాగా చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చార‌నే విష‌యం తెలుసుకున్న మంత్రులు, టీడీపీ నేతలు మాట్లాడుతూ ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చామ‌నే కార‌ణంతోనే బీజేపీ చంద్ర‌బాబుపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు.
కాగా టీడీపీ నాయ‌కుల విమ‌ర్శ‌ల‌పై బీజేపీ నాయ‌కులు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి స్పందించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి కోర్టు నోటీసులు పంపిస్తే బీజేపీని ఎందుకు ఆడిపోసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. నోటీసుల‌కు, బీజేపీకి ఏమీ సంబంధం లేద‌న్నారు. 2010 నాటి కేసులో బీజేపీపై ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్నే అడగాలని టీడీపీ నేత‌ల‌కు సూచించ‌డం విశేషం.

Share