ఇది రాజ‌కీయం కాదా బాబూ?

ఏపీ టాప్ న్యూస్‌: మ‌హారాష్ట్ర‌లోని బాబ్లీ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా 2010లో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు, మ‌రికొంత‌మంది టీడీపీ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టిన నేప‌థ్యంలో వారిపై మహారాష్ట్ర ధర్మాబాద్‌ పోలీసులు ప‌లుసెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన విష‌యం, ఈ కేసుల‌కు సంబంధించి వాళ్ల‌కు ధర్మాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్  జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే నాన్ బెయిల‌బుల్ వారెంట్‌పై చంద్ర‌బాబునాయుడు కానీ, టీడీపీ నేత‌లు కానీ  స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఇదంత రాజ‌కీయ ల‌బ్ధికోస‌మేన‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆందోళ‌న, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తే వాళ్ల‌పై పోలీసులు కేసులు న‌మోదుచేయ‌డం, వారికి నోటీసులు, వారెంట్లు పంపించ‌డం స‌ర్వ‌సాధార‌నం. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ నేత‌ల‌పైన‌, ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీ ప్ర‌జ‌ల‌పై ఎన్నో కేసులు పెట్టారు. వారంతా కోర్టుకెళ్లి వారెంట్ల‌ను రీకాల్చేయించుకున్నారు. మ‌రికొంద‌రు కోర్టుల‌కు హాజ‌ర‌వుతూనే ఉన్నారు.

అయితే ఇక్క‌డ చంద్ర‌బాబు నాయుడు ఒక్క‌రికే దేశంలో ఎవ‌రికీ ఇవ్వ‌ని విధంగా నాన్ బెయిలబుల్ వారంటు ఇచ్చిన‌ట్లు టీడీపీ నేత‌లు మాట్లాడ‌డం నిజంగా ఆశ్చ‌ర్యంగా ఉంది. చంద్ర‌బాబుకు ధ‌ర్మాబాద్ కోర్టు ఇచ్చిన నోటీసు ఇదిమొద‌టిసారీ కాదు. ధర్మాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 2013 ఆగస్టు 31న విచారణ ప్రారంభించి విచారణ ప్రాథమిక దశలో నిబంధనల ప్రకారం కేసులో నిందితులైన చంద్రబాబునాయుడు తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఆతరువాత వ్యక్తిగతంగా హాజరు కావాలన్న ఆదేశాలను చంద్రబాబు తదితరులు బేఖాతరు చేసిన నేప‌థ్యంలో నిబంధనల ప్రకారం న్యాయస్థానం చంద్రబాబు తదితరులకు తొలిసారి 2015 సెప్టెంబర్‌ 21న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీచేసింది. అప్పటి నుంచి గత నెల 16వ తేదీ వరకు మొత్తం 37సార్లు ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రతిసారి  నాన్ బెయిల‌బుల్ (అన్‌రెడీ) పేరుతో కేసు విచారణకు వచ్చింది.

ఇదేదో ఎవ‌రికీ జ‌ర‌గ‌ని  విధంగా చంద్ర‌బాబు ఒక్క‌డి విష‌యంలోనే ఇలా జ‌రుగుతోంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం చంద్ర‌బాబుపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని టీడీపీ నేత‌లు మాట్లాడ‌డం సిగ్గుచేటు. చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు రోడ్లెక్కి చేస్తున్న విన్యాసాల వెనుక రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆరాటం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని, టీడీపీ నాయకుల ధర్నాలు, ఆందోళనలు, వినూత్న హంగామాలవెనుక చంద్రబాబు రచించిన పెద్ద పథకమే దాగి ఉందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. దేనిని అయినా త‌నకు రాజ‌కీయ ల‌బ్ధి చేకూరేలా మార్చుకోవ‌డంలో చంద్ర‌బాబు దిట్ట అన్న‌ది మాత్రం అంద‌రూ ఒప్పుకునే విష‌యం.

 

Share