అవ‌మానించిన పార్టీతో పొత్తా?

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం అనైతిక‌మ‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా అన్నారు. బీజేపీ ఆధ్వ‌ర్యంలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు త‌ప్పు చేస్తున్నార‌న్నారు. నాడు ముఖ్య‌మంత్రి అంజ‌య్య‌ను కాంగ్రెస్ పార్టీ అవ‌మానించింద‌ని, ఆ నేప‌థ్యంలో తెలుగువారి ఆత్మ‌గౌర‌వం నినాదంతో నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగుదేశంపార్టీని స్థాపించార‌ని, అలాంటి టీడీపీ నేడు కాంగ్రెస్ పార్టీతో క‌ల‌వ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్య ఒప్పందాలు ఏంటో అర్థం కావ‌డం లేద‌న్నారు. చంద్రబాబుకు కోర్టు నోటీస్ రావడం వెనుక భార‌తీయ జ‌న‌తా పార్టీ హ‌స్తం ఉంద‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌న్నారు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉంటూ బాబు అలామాట్లాడ‌డం సిగ్గు చేట‌న్నారు. చంద్ర‌బాబు సానుభూతి కోసం అలా మాట్లాడుతుండొచ్చ‌న్నారు. కేసు విషయంలో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, చంద్ర‌బాబుపై కేసు నమోదైన సందర్భంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అమిత్ షా గుర్తు చేశారు.

Share