ప్ర‌తి స్కీంలో ఒక‌ స్కాం

ఏపీ టాప్ న్యూస్‌: “నేను నిప్పును..అవినీతికి ఆమ‌డ దూరం ఉంటాను“ అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చెబుతున్న మాట‌ల‌న్నీ అవాస్త‌వాలేనా? త‌న ద‌గ్గ‌ర ఆస్తులేమీ లేవంటున్న చంద్ర‌బాబు ద‌గ్గ‌ర లక్ష‌ల కోట్లు అవినీతి సొమ్ము ఉందా?  బాబు పాల‌న అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిందా?  రాష్ట్ర చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ జ‌ర‌గ‌నంత‌గా బాబు పాల‌న‌లో అవినీతి జ‌రుగుతోందా? అంటే అవున‌నే అంటున్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహారావు. ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో చంద్ర‌బాబు పాల‌న‌పై దుమ్మెత్తి పోశారు. `ప్ర‌తి స్కీంలో ఒక స్కాం చేస్తున్నారు` అంటూ విమ‌ర్శించారు. అంతేకాదు ప్ర‌తి తెలుగుదేశం పార్టీ  నేతా అడ్డ‌గోలుగా అక్ర‌మాలు చేసి సంపాదించుకుంటున్నార‌ని ఆరోపించారు.  ఏపీ చరిత్రలోనే చంద్రబాబు ప్రభుత్వం వంటి అవినీతి ప్రభుత్వం ఇంతకుముందెన్నడూ లేదని,  ఆలస్యం అవుతుందేమో కానీ అవినీతి చేసినవారెవరైనా జైలు ఊచలు లెక్క పెట్ట‌క త‌ప్ప‌దంటూ ప‌రోక్షంగా చంద్ర‌బాబునుద్దేశించి అన్నారు.

అయితే చంద్ర‌బాబునుద్దేశించి తాము ఏం మాట్లాడినా ప‌క్కా ఆధారాల‌తో మాట్లాడుతున్నామ‌ని, కానీ టీడీపీ నేత‌లు మాత్రం మాపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌ను దేనికి ఎంత ఖ‌ర్చు పెట్టారో చెప్ప‌మని అడుగుతుంటే నేటి వ‌ర‌కు చెప్ప‌లేద‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికైతే తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదంటూనే 2024 నాటికి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తామే అధికారంలోకి వ‌స్తామ‌ని జీవీఎల్ న‌ర‌సింహారావు ధీమా వ్య‌క్తం చేశారు. ఏదైమైనా ఈ మ‌ధ్యన బీజేపీ నేత‌లు బాబుపై ఒంటికాలుపై లేస్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Share