చంద్రబాబుకు గతాన్ని గుర్తు చేసిన కేటీఆర్
ఏపీ టాప్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కాలం కలిసివస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఇటీవల ఆయన ఏది చేసినా అడ్డం తిరుగుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతల నుంచే కాదు… సొంత పార్టీ నేతల నుంచి కూడా మాటలు పడాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న నాటి నుంచి టీఆర్ఎస్ నేతలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మొదలు కొని ఆపద్ధరమ్మ మంత్రులు, నాయకులు వరకు అందరూ చంద్రబాబును టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చేస్తుండగా, మొన్న తలసాని శ్రీనివాస యాదవ్.. నిన్న నాయిని నరసింహారెడ్డి..నేడు కేటీఆర్ ఇలా ఒకరి తర్వాత ఒకరు బాబు దుర్మార్గాలను ఎండగడుతున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీని తిడుతూ చేసిన ట్వీట్లను ఆపద్ధర్మమంత్రి కేటీఆర్ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పచ్చపార్టీ అధినేతపై విరుకుపడ్డారు.
గతంలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బాబు చేసిన ట్వీట్లను కేటీఆర్ పోస్టు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీని ఇటాలియన్ మాఫియా రాజ్‌తో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడదే ఇటాలియన్ మాఫియా రాజ్ తో ఎలా జతకట్టారని ప్రశ్నించారు. అందుకే అది మహాకూటమి కాదు.. మహాఘటియా బంధన్ అని కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించడం వల్లే 2004లో కాంగ్రెస్‌తో.. 2009లో టీడీపీతో టీఆర్ ఎస్ పొత్తుపెట్టుకుందని వివరించారు. టీడీపీ-కాంగ్రెస్ మాత్రం అవకాశవాదం.. అధికార దాహంతోనే ఒక్కటయ్యాయని మండిపడ్డారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శల దాడికి చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారడంలో ఎలాంటి సందేహం లేదు.