రూ.16600 కోట్ల ఒప్పందం ఏంటి?

ఏపీ టాప్ న్యూస్‌: `జీరో బ‌డ్జెట్ ప్ర‌కృతి వ్య‌వ‌సాయం` ఈ పేరు గ‌త కొంత‌కాలంగా ఏపీలో బాగా వినిపిస్తోంది. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం గురించి రాష్ట్ర ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు కూడా ఎక్కువ‌గానే మాట్లాడుతున్నారు. ఇటీవ‌ల దీని గురించే ఐక్య‌రాజ్య స‌మితి వేదిక‌పై బాబు ప్ర‌సంగం కూడా చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే జీరో బ‌డ్జెట్‌తో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం అంటూనే వేల కోట్లు దోచుకుంటున్నార‌ని, ఇది పెద్ద కుంభ‌కోణ‌మ‌ని బెంగ‌ళూరుకు చెందిన ఒక ఎన్జీవో సంస్థ 45 పేజీల్లో ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఇదే విష‌యాన్ని కోట్ చేస్తూ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.  జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంటూనే ఒక కంపెనీతో రూ.16600 కోట్ల రూపాయల ఎంవోయూ ఎందుకు చేసుకున్నారో స‌మాధానం చెప్పాల‌ని చంద్ర‌బాబును డిమాండ్ చేశారు. అంతేకాదు రూ.16600 కోట్లు ఎక్క‌డ ఖ‌ర్చు పెడుతున్నారో కూడా స‌మాధానం చెప్పాల‌న్నారు.

జీరో బ‌డ్జెట్ ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై అనుమానం వ‌చ్చి తాను ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వద్దకు వెళ్లానని, వారిలో కొందరికీ మాత్రమే ఆవు పేడను మురగబెట్టేందుకు డ్రమ్ములు ఇచ్చారని.. వాటి విలువ బయట మార్కెట్లో నాలుగు వందలు కూడా ఉండదని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం నాలుగువేలుగా చూపించిందని  చెప్పుకొచ్చారు ఉండ‌వ‌ల్లి. ఒక కంపెనీతో రూ.16600 కోట్ల‌ ఒప్పందంపై సమాచార హక్కు చట్టం కింద తాను దరఖాస్తు చేసుకుంటే.. సెక్షన్ 8 ప్రకారం ఆర్టీఐ చట్టం ఈ అంశానికి వర్తించదని ఏపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని, కేవలం దేశ రక్షణకు సంబంధించిన విషయాలు మాత్రమే బయటపెట్టరని.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8.. ఒప్పందానికి ఎలా వర్తిస్తుందని ఉండవల్లి ప్రశ్నించారు. తనది పారదర్శక పాలన అని చెప్పుకునే చంద్రబాబు ఇలా జీరోబడ్జెట్ పేరుతో ఒక కంపెనీతో రూ.16600 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకోవడం వెనుక ఉన్న మ‌త‌ల‌బు ఏమిటో చెప్పాల‌ని ఉండ‌వ‌ల్లి డిమాండ్ చేశారు.

Share