ఘనంగా ప్రారంభ‌మైన న‌వ‌రాత్రి వేడుక‌లు

ఏపీ టాప్ న్యూస్‌: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ.. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులతో దుర్గమ్మ ఆలయాన్ని ముస్తాబు చేసింది. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా.. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. పది రోజుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు. ఒక్కో అలంకారానికి ఒక్కో ప్రత్యేకత. స్వర్ణకవచాలంకృత కనకదుర్గ,బాలా త్రిపురసుందరీ దేవి, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాలక్ష్మి, సరస్వతీ దేవి, కనకదుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. కాగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి సన్నిథిలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ శ్రీ పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
అటు తిరుమలలో నేటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకొక వాహన సేవలో దర్శనమివ్వనున్నారు. అటు శరన్నవరాత్రుల ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రంలో అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. 9 రోజుల పాటు నిర్వహించే నవరాత్రి మహోత్సవాల కోసం ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Share