చంద్ర‌బాబు గారూ.. మీ ద‌గ్గ‌ర డ‌బ్బులు ప్రింట్ చేసే మిష‌న్ ఉందా?

ఏపీ టాప్ న్యూస్‌: “చంద్ర‌బాబు గారూ.. రాష్ట్రంలో నిర్మిస్తున్నప్రాజెక్టుల‌కు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయి? ఆ ర‌హ‌స్యం ఏంటి? మీ ద‌గ్గ‌ర డ‌బ్బులు ప్రింట్ చేసే మిష‌న్ ఏమైనా ఉందా? నిజం చెప్పండి.. అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అడిగారు. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డ న‌వ్వుల పూలు పూశాయి. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఈ రోజు చంద్రబాబు అనంతపురం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా అనంత‌పురంలో జ‌రిగిన‌ సభలో జేసీ మరోసారి తన ఛలోక్తులతో ఆకట్టుకున్నారు. ఓవైపు బాబుపై ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు జోకులు వేస్తూ తనదైన శైలిలో మాట్లాడారు.
రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏం సీఎం ఇవ్వనన్ని ప్రాజెక్టులు చంద్రబాబు ఇచ్చారని కితాబిచ్చారు జేసీ. బీడు భూములకు నీళ్లు అందిస్తున్నారని.. సీమవాసులంతా చంద్రబాబుకు రుణపడి ఉంటారన్నారు. రాష్ట్రంపై కేంద్రం వివక్షతో వ్యవహరిస్తున్నా.. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పని చేస్తున్నారన్నారు. దేశంలో నదుల అనుసంధానం గురించి ఎన్నో రోజులుగా వింటున్నానని.. ఏ మొగోడు చేయలేదని చంద్రబాబు చేసి చూపించారని ప్రశంసించారు. అయితే జేసీ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. జేసీకి ఒక్క‌రికే చంద్ర‌బాబు చేస్తున్న అభివృద్ధి క‌నిపిస్తున్న‌ట్లు ఉందంటూ మండిప‌డుతున్నారు.

Share