జ‌న‌సేన‌లోకి నాదెండ్ల‌

ఏపీ టాప్ న్యూస్‌: అస‌లే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బ‌లం అంతంత మాత్ర‌మే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులు, కొంత పేరు, బ‌లం ఉన్న నాయ‌కులు సైతం వేరే పార్టీల వైపు చూస్తే ఇక ఆ పార్టీ ప‌రిస్థితి గురించి వేరే చెప్పాల్సిన ప‌నిలేదు. కాంగ్రెస్ పార్టీలో మంచి పేరుతో పాటు, స్పీక‌ర్‌గా ప‌నిచేసిన నాదెండ్ల మ‌నోహ‌ర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి జ‌న‌సేన‌లో చేర‌బోతున్నారు. విస్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఈ రోజు ఉద‌యం జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇద్ద‌రూ కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. మనోహర్‌ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని జనసేన భావిస్తోంది. కాగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. 2004, 2009లో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విభజన నిర్ణయం కారణం చేత 2014లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ వ్యవధిలో నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు అలంకరించారు. ప్రభుత్వంలోని పలు హోదాల్లో, అసెంబ్లీ కమిటీల్లో పనిచేశారు .

దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో  కొంత కాలం డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించిన నాదెండ్ల…2011లో స్పీకర్‌గా ప్రమోట్ అయ్యారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోవడంతో కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరించారు.. చివరకు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అనుచరులతో సూచనల మేరకు నాదెండ్ల జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని వినికిడి.

Share