కేసీఆర్‌ను న‌మ్మి మోస‌పోయా

ఏపీ టాప్ న్యూస్: “కేసీఆర్ పాలన మీద నమ్మకంతోటే.. ఆయనపైనున్న ఇష్టం వల్లే రాజకీయాల్లోకి వ‌చ్చా.. ఆయన దారే నా దారి అనుకున్నా.. ఇన్ని సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా కూడా.. స్థానికుడి కోటాలో మరొకరికి టికెట్ ఇవ్వడంతో నేను ఆశ్చర్యపోయా. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న న‌న్ను సంప్ర‌దించ‌కుండా.. వేరే వ్య‌క్తికి టికెట్ ఇవ్వ‌డం  ఏంటి?  కేసీఆర్ అలా చేయ‌డం వ‌ల్లే నేను తీవ్రంగా న‌ష్ట‌పోయారు. న‌మ్మి మోస‌పోయా“ అంటూ మెద‌క్ జిల్లా ఆంధోల్ ఎమ్మెల్యే బాబు మోహ‌న్ అన్నారు. కేసీఆర్ గురించి త‌న మన‌సులో మాట‌ను చెప్పారు.  అయినా కేసీఆర్ తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని బాబూ మోహన్ వివరణ ఇచ్చారు. అయితే తాను అంతగా ఆరాధించే నాయకుడి వల్లే తాను నడిరోడ్డు మీదకు రావాల్సి వచ్చిందనే బాధ, ఆవేదన తనకు ఉన్నాయని.. ఇవి నిజాయతీతో అంటున్న మాటలు అని తెలిపారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తనకు మచ్చ లేని నాయకుడనే పేరు మాత్రం వచ్చిందని, తన జీవితానికి అది చాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎన్నడూ పార్టీ టికెట్ కోసం ప్రగతి భవన్ చుట్టూ తిరగలేదన్నారు.

నిజాయతీతో కూడిన తన రాజకీయ జీవితాన్ని చూసే బీజేపీ తనను పార్టీలోకి ఆహ్వానించిందని, అందుకే ఆ పార్టీలో చేరానని బాబూ మోహన్ వివరణ ఇచ్చారు. బీజేపీ తరఫున మళ్లీ ఆంధోల్ నుండి పోటీ చేయనున్నట్లు బాబూ మోహన్ ప్రకటించారు.   1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం నుంచి టీడీపీ శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసిన బాబూ మోహన్ ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన విష‌యం తెలిసిందే.

Share