ఏపీలో న‌ర‌కాసుర పాల‌న‌

ఏపీ టాప్ న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న‌ర‌కాసుర పాల‌న సాగుతోంద‌ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ విమర్శించారు. ఈ అవినీతి ప్రభుత్వానికి ఈ దీపావళి తో అంతం అయ్యే రోజులు వచ్చాయని ఆయన అన్నారు. పెద్దాపురం సభలో ఆయన చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై విరుచుకుపడ్డారు.2019 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, అవినీతి ప్రభుత్వం దీపావళి టపాసులుగా పేలి పోతుందని చెప్పారు. చంద్రబాబుకు అనుభవం ఉన్న కారణంగా 2014లో ఆయనకు మద్దతు ఇస్తే అధికారంలోకి వచ్చాక ఆయనతోపాటు మంత్రులు అవినీతికి బాటలు వేసి రాష్ట్రాన్ని దోచుకొంటున్నారని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడడంతోనే చంద్రబాబు హైదరాబాద్‌ను వదలి అమరావతికి వచ్చేశారని ఆరోపించారు.ముఖ్యమంత్రి కొడుకు లోకేష్‌తో పాటు రాష్ట్ర మంత్రులు యనమల, నిమ్మకాయల చినరాజప్ప అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పెద్దాపురం నియోజకవర్గంలో కేవలం సూరంపాలెం గ్రామంలోనే రూ. రెండు వేల కోట్లు దళితుల భూముల్లో మైనింగ్‌ పేరుతో దోచుకున్నారని, దానికి తన వద్ద ఆధారాలున్నాయని పవన్‌ ప్రకటించారు.

Share