ఇంత‌కీ ప‌వ‌న్ పోటీ ఎక్క‌డి నుంచి?

ఏపీ టాప్ న్యూస్‌: జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో ఏ నియోజ‌క‌వ‌ర్గం పోటి చేస్తారు?  ముందుగా అనుకున్న‌ట్లు అనంత‌పురం నుంచా?  లేదా పిఠాపురం నుంచా? ఈ రెండూ కాకుండా మ‌రెక్క‌డి నుంచి అయినా పోటీ చేస్తారా? ఇదే అనుమానం రాష్ట్ర ప్ర‌జ‌లకే కాదు జ‌న‌సేన అభిమానుల‌కూ క‌లుగుతోంది. కొన్ని నెల‌ల క్రింత అనంత‌పురం వెళ్లిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ తాను వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లాలోని ఏదోఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టంగా చెప్పారు. మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత తాజాగా పిఠాపురంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ పిఠాపురం ప్రత్యేకత శ్రీపాద శ్రీవల్లభుడేనని.. ఆయన ఆశీస్సులుంటే ఇక్కడి నుంచే పోటీ చేస్తానేమోనని అన్నారు. దీంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తున్నార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే మ‌రో కొత్త వాద‌న వినిపిస్తోంది. అనంత‌పురం, పిఠాపురం కాదు పాడేరు నుంచి పోటీ చేసేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌క్కువ చూపుతున్నార‌ట‌. అయితే పాడేరు రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అని పాపం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు తెలుసో?  లేదో? . అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీపై ఆయ‌న స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న లేద‌ని, ఇక ఆయ‌న రాష్ట్రాన్ని ఏం ఉద్ద‌రిస్తాడ‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కానీ, రాజ‌కీయాల‌పై గానీ అవ‌గాహ‌న లేద‌ని, అందుకే ఏదిప‌డితే అది మాట్లాడుతున్నార‌ని మండిప‌డున్నారు. లోకేష్‌ను విమ‌ర్శిస్తున్న ప‌వ‌న్‌పై కూడా వాళ్లు తీవ్ర స్థాయిలోనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పంచాయ‌తీ మెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌లేని లోకేష్‌ను చంద్ర‌బాబు మంత్రిని చేశార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్నార‌ని,  లోకేష్‌ పంచాయతీ మెంబర్‌ కూడా కాలేదు.. మరి మీరు దేనికి మెంబర్‌ అయ్యారని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌క‌టిస్తూ పోతున్నారు త‌ప్పితే తాను ఎక్క‌డినుంచి పోటీ చేస్తార‌న్న‌ది ఇప్ప‌టికైతే స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. క‌నీసం మునుముందైనా ఇస్తారేమో చూద్దాం.

Share