తాడేప‌ల్లిలో 144 సెక్ష‌న్‌ మాణిక్యాల‌రావు గృహనిర్బంధం

ఏపీ టాప్ న్యూస్‌: తాడేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మొన్న‌టి వ‌ర‌కు భుజాల‌మీద చేతులు వేసుకుని తిరిగిన నాయ‌కులు ఇప్పుడు ఒక‌రిపై మ‌రొక‌రు క‌త్తులు దూస్తున్నారు. తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గం మా హ‌యాంలో అభివృద్ధి చెందిందంటే.. కాదు కాదు మా హ‌యాంలో అభివృద్ధి చెందిందంటూ చెప్పుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి హ‌యాంలో అభివృద్ధి చెందిందో బ‌హిరంగంగా చ‌ర్చిద్దామ‌ని ఇరుపార్టీల నాయ‌కులు స‌వాల్ విసురుకున్నారు. దీంతో పోలీసులు అక్క‌డ 144 సెక్ష‌న్ విధించారు. వివ‌రాల్లోకి వెళ్లితే..అభివృద్ధిపై చర్చకు అటు టీడీపీ, ఇటు బీజేపీ సై అనడంతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. చర్చలో పాల్గొనేందుకు వెంకటరామన్నగూడెం చేరుకున్న జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అటు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావును తాడేపల్లిగూడెంలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు కూడా తాడేపల్లిగూడెంలో మాత్రం రెండు పార్టీల మధ్య ఉప్పునిప్పుగా పరిస్థితి ఉండేది. తాజాగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఇరు వర్గాల మధ్య రచ్చ మొదలైంది.
నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధి చేసిందని, అడ్డుకోలేదని…ఈ విషయంలో మాణిక్యాలరావుతో చర్చకు సిద్ధమని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరించిన మాణిక్యాలరావు చర్చకు ఎక్కడైనా సిద్ధమని ప్రకటించారు. అభివృద్ధిపై చర్చకు ఇరువర్గాలు వెంకటరామన్నగూడెంను వేదికగా చేసుకున్నాయి. ఇరు పార్టీల నేతలు ఉదయం పది గంటలకు టైం ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఈ చర్చతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లిగూడెంలో 144 సెక్షన్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ముందస్తు చర్యగా అటు ఎమ్మెల్యేను, ఇటు జెడ్పీ చైర్మన్‌ను గృహనిర్బంధం చేశారు.

Share