జేడీఎస్‌తో కూట‌మి ఏంటి బాబూ?

ఏపీ టాప్ న్యూస్‌:  లౌకిక వాద పార్టీల‌న్నీ ఏక‌తాటిపైకి తెస్తానంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కొన్ని రోజులుగా ప‌లు పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌ను క‌లుస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా క‌ర్నాట‌క వెళ్లి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామిలతో చర్చలు జరిపారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను,దేశాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బెంగళూరు వచ్చానని,  దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం గురించి కుమారస్వామి, దేవె గౌడలతో చర్చించిన‌ట్లు తెలిపారు. తన లక్ష్యం రాజకీయాలు కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు.  రెగ్యులేటరీ బాడీ అయిన ఆర్బీఐ ప్రస్తుతం మోదీ ప్రభుత్వ ఒత్తిడిలో ఉందన్నారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను దుర్వినియోగం చేస్తున్నారని, ఈ వ్యవస్థలను ఉపయోగిస్తూ గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

అయితే ఇక్కడ అంద‌రికీ అనుమానం వ‌చ్చే విష‌యం ఏమిటంటే.. ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి కుమార స్వామి పార్టీ అయిన జేడీఎస్ ప్రభుత్వం నడుపుతోంది.మరి కొత్తగా చంద్రబాబు వీళ్లతో కూటమి కట్టవలసిన అవ‌స‌రం ఏంటి? అన్న‌ది ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డం లేదు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం, అత్య‌ధిక కాలం ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడికి ఈ మాత్రం తెలియ‌దా?  రాజ‌కీయాల్లో త‌నంత సీనియ‌ర్ నాయకుడే లేడ‌ని చెబుతున్న బాబు ఇలా ప‌లు పార్టీల నాయ‌కుల చుట్టూ తిర‌గ‌డం వెనుక ఏమైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Share