నేడు బాలల దినోత్సవం
ఏపీ టాప్ న్యూస్: దేశవ్యాప్తంగా బాలలకు ”చాచా (మామయ్య)”గా గుర్తింపు పొందిన జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం నేడు. ఈ రోజునే బాలల దినోత్సవాన్ని జరుపుకొంటారు. బాలలను అమితంగా ఇష్టపడే నెహ్రూ నవంబర్ 14, 1889న జన్మించారు. భారత స్వాతంత్య్రపోరాటంలో ప్రముఖ నాయకుడు. పండిత్జీగా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయాలలో నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు. న్యాయవాది, రాజకీయ వేత్త మోతీలాల్ నెహ్రూ కుమారుడైన నెహ్రూ, యువకునిగా ఉన్నప్పుడే భారత జాతీయ కాంగ్రెస్లో నాయకుడయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి సంపూర్ణ స్వాతంత్య్ర సముపార్జనకు అనుకూలుడైన నెహ్రూ, గాంధీజీ సలహాలతో, ప్రజాకర్షణ కలిగిన సంస్కరణ వాద నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. దీర్ఘ కాలం కొనసాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్యపాత్ర వహించి గాంధీకి రాజకీయ వారసునిగా గుర్తింపుపొందారు. స్వంతంత్ర భారతదేశ మొదటి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీచే ఎన్నికయ్యారు. 1947 తర్వాత1952 లో భారతదేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినపుడు ప్రధాని అయ్యారు. అందరికంటే ఎక్కువకాలం పనిచేసిన ప్రధాన మంత్రి కూడా ఈయనే. ఇతని పదవీ కాలం 1947 నుండి 1964 వరకు సాగింది.
ఆగష్టు 15, 1947న భారత దేశం స్వాతంత్య్య్రం సంపాదించినపుడు న్యూఢిల్లీలో స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసే గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు నెహ్రూ. మే 27, 1964న నెహ్రూ మృతి చెందారు. స్వతంత్య్ర భారత దేశాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్లడానికి కృషి చేసిన అతనిని ‘నవ భారత రూపశిల్పి’గా పేర్కొంటారు.