చంద్రబాబు లాంటి వారుంటారని అంబేద్కర్ ముందే ఊహించారట
ఏపీ టాప్ న్యూస్: “ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంటి వారు ఉంటారని ముందే ఊహించారా? అందుకే రాజ్యాంగాన్ని రాశారా?“ అంటే అవుననే అంటున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. దళితులను ఏడిపించుకుతినేవారు ఉంటారనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని అంటారు. ఎమ్మెల్యే ఆళ్ల.. చంద్రబాబును అంత మాట ఎందుకన్నారనే వివరాలు తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా లాక్కొని అన్నదాతల నోట్లో మట్టి కొట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా బలవంతంగా లాక్కుంటున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. దళితులు పండించుకునే భూములను తీసుకోవడానికి ప్రభుత్వానికి అర్హత లేదని, ఒకవేళ రైతులు ఇష్టపడి ఇస్తే రాజధానిలో పట్టా భూములకు ఇచ్చే ప్యాకేజీ.. అసైన్డ్ భూముల రైతులకు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతికి వచ్చారని, ఇక్కడికి వచ్చి రాజధాని నిర్మాణం పేరిట రైతులను బెదిరిస్తూ పంట పొలాలను లాక్కున్నారని, చంద్రబాబు లాంటివాడు ఉంటాడనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు దళితులు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. వైయస్ జగన్ వల్లే దళితుల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.