రియ‌ల్ హీరో మ‌హేష్

ఏపీ టాప్ న్యూస్‌: “ఏళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత పెరగడం నన్నెంతో ఆశ్చర్యపరుస్తోంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమండ్రి నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత సంతోషాన్నిచ్చింది. ఆమె తన అభిమానంతో నా హృదయాన్ని గెలుచుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది“అని త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో రాసుకొచ్చారు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి అనే 106 ఏళ్ల బామ్మకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే వీరాభిమానం. మహేష్ ను చూడాలనేది ఆమె కోరిక. దాంతో ఈ బామ్మ ఏకంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ విషయం తెలిసి ప్రిన్స్ ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇక బామ్మకు కలిసిన మహేష్ ఎంతో ఆప్యాయంగా ఆమె అక్కున చేరిపోయారట. ఆమె నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ఆమె ప్రేమాభిమానాలు తనకి ఎంతో ఆనందాన్ని కలిగించాయని చెప్పాడు ప్రిన్స్.
బామ్మను కలిసిన ఈ సంఘటనను తాను ఎప్పటికీ మరిచిపోలేని సూపర్ స్టార్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో వేసిన ఓ విలేజ్ సెట్టింగ్ లో జరుగుతుంది. భారీ వ్యయంతో ఈ సెట్టింగ్ నిర్మించినట్లు సమాచారం. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న ‘మహర్షి’ విడుదల కానుంది.

Share