రేవంత్ సీఎం అభ్య‌ర్థా?

ఏపీ టాప్ న్యూస్‌: తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌నేప‌థ్యంలో ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గులాం న‌బీ అజాద్ పెద్ద బాంబు పేల్చారు. తెలంగాణ‌లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడిపోతారు? టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుందా? కాంగ్రెస్ కూట‌మికి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌ని నిన్న‌టి వ‌ర‌కు మాట్లాడుకున్న జ‌నం ఇప్పుడు తెలంగాణ‌లో కూట‌మి గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతారంట అని చ‌ర్చించుకోవ‌డం మొద‌లు పెట్టారు. రేవంత్ రెడ్డి ఏంటి.. ముఖ్య‌మంత్రి ఏంటి అనుకుంటున్నారా? అయితే వివ‌రాల్లోకి వెళ్దాం.. తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు కొడంగ‌ల్ వ‌స్తున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి, మ‌ళ్లీ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గులాం న‌బీ ఆజాద్ రేవంత్ రెడ్డిని ప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చి అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ “ఈ రోజు సీఎం సీటులో కేసీఆర్ ఉండొచ్చ‌ని, రేపు అదే సీటులో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చ‌ని“ అని అన్నారు.
అంతేకాదు సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్పకాదని కేసీఆర్‌నుద్దేశించి అన్నారు. రేవంత్‌ రెడ్డిని బయటకు వదిలి కేసీఆర్‌ కొడంగల్‌కు రావాలని స‌వాల్ చేశారు. రేవంత్‌ను అరెస్ట్‌ చేసి ఇక్కడికి రావడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. అయితే సీఎం సీటులో రేవంత్ రెడ్డి ఉండొచ్చ‌న్న మాట‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మ‌రో రెండు రోజుల్లో ఎన్నిక‌లు పెట్టుకుని ఆజాద్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై కాంగ్రెస్‌పార్టీ సీనియ‌ర్లు అంతా ఆయ‌న‌పై గుర్రుగా ఉన్నారు. నిన్న మొన్న వ‌చ్చిన రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అయితే మేమంతా ఏంటి అంటూ కొంత‌మంది సీనియ‌ర్లు బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ మామూలేనంటూ స‌ర్ధిచెప్పే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం విశేషం.

Share