కాంగ్రెస్‌..టీడీపీ ప్ర‌భుత్వాలు ముస్లింల‌ను ప‌ట్టించుకోలేదు

ఏపీ టాప్ న్యూస్‌: కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఏనాడూ ముస్లింల‌ను ప‌ట్టించుకోలేద‌ని ఎంఐఎం పార్టీ చీఫ్ అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అస‌దుద్దీన్ మాట్లాడుతూ దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఒక్క‌రే ముస్లింల‌కు మేలు చేశార‌ని, అంత‌కు ముందు కానీ, ఆ త‌ర్వాత కానీ ఎవ‌రూ ముస్లింల‌నుప‌ట్టించుకోలేద‌న్నారు. రెండు రోజుల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఎనిమిది స్థానాల్లో గెలుస్తుంద‌ని అన్నారు. త్వరలో ఎంఐఎం మహిళా విభాగం ఏర్పాటు చేస్తామని ఒవైసీ తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ముస్లింల గురించి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో మహాకూటమితో పాటు, బీజేపీకి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ఒవైసీ జోస్యం చెప్పారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంతో తాము భాగస్వామ్యులం కామని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ఒవైసీ తెలిపారు.

Share