ముగిసిన ఎన్నికల ప్రచారం

ఏపీ టాప్ న్యూస్‌: నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి తెర పడింది. బుధవారం సాయంత్రం 5 గంట‌ల‌తో ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు కూడా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాయి. వీలైనంతగా ప్రచార జోరును పెంచాయి. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చివరగా కోదాడలో ప్రచారం చేస్తే, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ప్రచారాన్ని ముగించారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీటీడీపీ, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, బీఎస్‌పీ, బీఎల్‌ఎఫ్ తదితర పార్టీలకు చెందిన జాతీయ నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు ఇప్పటివరకు తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.
ప్రచారానికి చివరి రోజు కావడంతో ఆయ పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ నెల 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి బహిరంగ సభలు నిర్వహించడం నిషేధం. ఆ నిబంధనలు అతిక్రమిస్తే…రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. మొత్తం 1,821మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Share