అక్క‌డ 35 ల‌క్ష‌ల న‌కిలీ ఓట్లా?

ఏపీ టాప్ న్యూస్‌: ఒక్క ఓటు నుంచి వంద ఓట్ల తేడాతో ఎంతోమంది తెలిచిన‌వాళ్లు ఉన్నారు.. ఓడిన వాళ్లూ ఉన్నారు. ప్ర‌తి ఓటూ చాలా విలువైందే. అలాంటి అక్క‌డ ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా 35 ల‌క్ష‌ల ఓట్లు న‌కిలీవి ఉన్నాయ‌ట‌. ఒక్క పేరుతో నాలుగు నుంచి ఐదు ఓట్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాట‌. మ‌రో ముఖ్య‌విష‌యం ఏమిటంటే ఇదంతా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌నేన‌ని అంటున్నారు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు. వివ‌రాల్లోకి వెళ్లితే… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 35 ల‌క్ష‌ల ఓట్లు న‌కిలీవి ఉన్నాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ సునీల్ అరోరాను క‌లిసిన పార్టీ నేత‌లు ఆధార్ కార్డుకు , ఓటుకు లింక్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిప‌రుల ఓట్లను తొలగిస్తున్నారని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఓట్లు తొలగించబడిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న అన్ని తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని కోరారు.ఎన్నికల కమిషనర్‌ను కలిసిన అనంతరం విజయసాయి రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఒకే వ్యక్తి పేరుతో నాలుగు, ఐదు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. సుమారు 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఏపీలో ఉన్నాయని స్పష్టం చేశారు. మరో 18 లక్షల మందికి ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని వివరించారు. ఓటర్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్‌ చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు.

Share