అభివృద్ధి తెల్ల కాగితాల్లో చూపిస్తే ఏం లాభం

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు అబ‌ద్ధాల కోరు అని విమ‌ర్శించారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా 330 రోజులుగా పాద‌యాత్ర‌చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ నేడు శ్రీ‌కాకుళం జిల్లా మెళియాపుట్టిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూనే చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు. బాబు విడుద‌ల చేసిన శ్వేత ప‌త్రాల‌పై స్పందించారు. చంద్రబాబు తెల్లకాగితాలపైనే అభివృద్ధి చూపుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇలాంటి అభివృద్ధి ఎవ‌రికి లాభం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అభివృద్ధి అన్న‌ది మ‌న ఇంటిలో, మన ఊరిలో, మన ప్రాంతంలో అభివృద్ధి ఉండాలి.ఆరోగ్యంలో అభివృద్ధి ఉండాలి, విద్య‌లో అభివృద్ధి ఉండాలి. ఉపాధిలో ఉండాలి. ఇవేవి లేకుండా తెల్లకాగితాలలో అబివృద్ధి చూపితే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. 2009 ఎన్నికలలో మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఏ పార్టీతో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారని,అది ఆయన చేసిన అభివృద్ది వల్ల అని ఆయన అన్నారు. చంద్రబాబు ఒకసారి బీజేపీతో, మరోసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప‌రిస్థితిలో ఉన్నార‌ని, రాహుల్‌ను రాష్ట్ర ద్రోహి అని చంద్రబాబు అప్పట్లో అన్నారని, ఇప్పుడు మోడీని అంటున్నారని ఇదే మోడీని పొగుడుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని జగన్ వ్యాఖ్యానించారు. అబ‌ద్ధాలు చెప్ప‌డం.. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం బాబు నైజం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Share