రాయ‌లసీమ అభివృద్ధే ల‌క్ష్యంగా పాల‌న‌

ఏపీ టాప్ న్యూస్‌: కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించినా..స‌హ‌క‌రించ‌క‌పోయినా రాయ‌ల‌సీమ అభివృద్ధే ల‌క్ష్యంగాపాల‌న చేస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. రాయ‌ల‌సీమ చ‌రిత్రే మారుస్తాన‌న్నారు. వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగసభలో చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ మన శక్తి ఏంటో కేంద్రానికి తెలియజెప్పేలా ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నెలలోపు ఉక్కుపరిశ్రమ భూసేకరణ పూర్తి చేసి, 3 నెలల్లో పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించానని తెలిపారు. కుప్పం కంటే పులివెందులకు నీళ్లిస్తానని చెప్పానని, చిత్రావతి ద్వారా నీళ్లిచ్చామన్నారు. రాబోయే రెండేళ్లలో గోదావరి నీళ్లు పెన్నాకు రానున్నాయని సీఎం చెప్పారు.రాయలసీమను పరిశ్రమల గడ్డగా తయారు చేసే బాధ్యత తనదని, కడప ఉక్కు పరిశ్రమతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ సిటీని ఏర్పాటు చేస్తామని, గండికోటను పర్యాటక కేంద్రంగా తయారు చేసే అవకాశముందని చెప్పారు. ఒక్క పైసా అవినీతి లేకుండా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామని చంద్రబాబు వివరించారు. ప్రపంచంలోనే సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్ష్యమని చెప్పారు. సంపద సృష్టించాలని, అదంతా పేదలకు దక్కాలని సీఎం ఆకాంక్షించారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాల్సిన అవసరముందని చెప్పారు.

Share