ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఢిల్లీ వేదిక‌గా జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఒక‌రోజు `వంచ‌న‌పై గ‌ర్జ‌న‌` దీక్ష కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. “ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు“ అంటూ నిన‌దించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాతోపాటు విభ‌జ‌న చ‌ట్టంలోపేర్కొన్న వ‌న్నీ కూడా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అనంత‌రం పార్టీ నాయ‌కులు మాట్లాడుతూ రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల‌పై నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల ముందు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, తెస్తామ‌ని చెప్పిన నాయ‌కులు నాలుగున్న‌రేళ్లు అయినా ఏపీకి హోదా ఇవ్వాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీనేన‌న్నారు. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్‌లు చేపట్టామని, పార్లమెంటులోపలా, బయటా పోరాటం చేశామన్నారు. హోదా కోసం ఎన్‌డీయే ప్రభుత్వంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేసిన‌ట్లు కూడా గుర్తు చేశారు.
ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్మ పోరాట దీక్షలతో బాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కాగా వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌లో పాల్గొన్న పార్టీ శ్రేణులు ఎక్కువ మంది న‌ల్ల బ్యాడ్జీలు, న‌ల్ల దుస్తులు వేసుకుని నిర‌స‌న తెలిప‌డం గ‌మ‌నార్హం.

Share