చివ‌రి అంకానికి ప్ర‌జా సంక‌ల్పం

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చివ‌రి అంకానికి చేరుకుంది. మ‌రో ఐదు రోజుల్లో ఇచ్ఛాపురం చేరుకోగానే పాద‌యాత్ర ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇచ్ఛాపురంలో భారీ స్థాయిలో ఫైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పైలాన్‌చుట్టూ లాన్‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు లాన్ నుంచి పైలాన్ బేస్‌కు చేరుకునేందుకు 13 మెట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేసినందుకు ఒక్కో జిల్లాకు చిహ్నంగా ఒక్కో మెట్టు ఏర్పాటు చేశారు. అంతేకాదు పైలాన్ పై భాగంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప‌తాకంలోని మూడు రంగుల‌తో కూడిన ఒక టోంబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అంటే అగ్ర‌భాగాన పార్టీ ప‌తాకాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో పాటు 13 జిల్లాల మీదుగా వైయ‌స్ జ‌గ‌న్ ఏఏ మార్గాల్లో న‌డిచారో అన్న‌ది సూచిస్తూ మ్యాన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కాగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ 13 జిల్లాల్లో 134 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర చేశారు. 231 మండ‌లాలు, 2516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేష‌న్ల మీదుగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర సాగింది. అయితే 55 ఆత్మీయ స‌మ్మేళ‌నాలు, 124 బ‌హిరంగ స‌భ‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. కాగా పాద‌యాత్ర ముగింపు నాటికి అంటే 341వ రోజు నాటికి వైయ‌స్ జ‌గ‌న్ 3648 కిలోమీట‌ర్లు న‌డ‌వ‌నున్నారు.

Share