మీ ప్రేమే న‌డిపించింది

ఏపీ టాప్ న్యూస్‌: ఏడాదికిపైగా పాదయాత్ర చేసింది తాను అయితే నడిపించింది ప్రజలే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా ‘మాట తప్పం, మడమ తిప్పం’ అంటూ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చిన ఆయన 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర నడిచారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్ జగన్ ప్రసంగించారు. ‘తాను ఇంత దూరం నడుస్తానని ఊహించలేదని, నడిచింది తాను అయినా నడిపించింది మీరే. మీ గుండె చప్పుడును నా గుండెచప్పుడుగా మార్చుకున్నా. ఎంతదూరం నడిచామన్నది ముఖ్యం కాదు. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నది ముఖ్యమని’ ఆయన ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నాలుగున్నరేళ్ల పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలు చెప్పారు. కరువుకాటకాలు, నిరుద్యోగం వీటికి తోడు చంద్రబాబు మోసం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. బాబు ప్రభుత్వం రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు.

650 వాగ్ధానాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. మోసం చేయడంలో ఆయన పీహెచ్‌డీ చేశారన్నారు. రెయిన్ గన్స్ పేరుతో చంద్రబాబు రైతులకు సినిమా చూపించారన్నారు. రోజుకో డ్రామా ఆడుతున్న చంద్రబాబును రైతులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దళారీ వ్యవస్థకు కెప్టెన్ చంద్రబాబు అని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Share