మంత్రి ప‌ద‌వి తీసుకున్నందుకు `సిగ్గుప‌డాలి సోమిరెడ్డి`

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేసిన ఇచ్ఛాపురంలో ముగించిన విష‌యం తెలిసిందే. అయితే ముగింపు స‌భ‌కు జ‌నం రాలేద‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఎద్దేవా చేశారు. దీనిపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ సోమిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముగింపు సభకు జనం రాకపోవడంతో ఆ సభ వెలవెలపోయిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అసలు అర్థమే లేద‌న్న రోజా ప్రజాక్షేత్రంలో ఐదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి.. ఏకంగా మంత్రి పదవి చేపట్టినందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. వైయ‌స్ జగన్ గెలిపించిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు కట్టబెట్టిన వారు సిగ్గుపడాలని వ్యాఖ్యానించిన రోజా… కోడికత్తి కేసులో టీడీపీ నేతలు జైలుకు వెళ్లే సమయం ఇంకెంతో దూరంలో లేదని అన్నారు.
ఇదిలావుంటే, నిన్ననే శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తన ప్రజా సంకల్ప యాత్ర ముగించుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఇవాళ తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇవాళ ఉదయం తిరుపతికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం కాలినడక మార్గం ద్వారా సాయంత్రానికి తిరుమలకు చేరుకోనున్నారు. దిగ్విజయంగా పాద యాత్ర ముగించుకున్న అనంతరం తొలిసారిగా తిరుమల వస్తున్న తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

Share