`మోడీ`కి పాలాభిషేకం

ఏపీ టాప్ న్యూస్‌: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు పాలాభిషేకం చేశారు. విశాఖపట్నంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి ప్రధాని మోదీ ఫొటోకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్థానికులకు స్వీట్లు, పువ్వులు పంచి ఈబీసీ బిల్లుపై హర్షం వ్యక్తంచేశారు.
కాగా, అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఈబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కీలకమైన ‘124వ రాజ్యాంగ సవరణ బిల్లు’కు రాజ్యసభ బుధవారం (జనవరి 9) ఆమోదం తెలిపింది. రాజ్యసభలో 167 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా, ఏడుగురు సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. లోక్ సభలోనూ భారీ మెజార్టీతో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మంగళవారం 323-3 ఓట్లతో లోక్ సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.

Share