శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సామాన్యుడిలా ఆలయానికి నడకదారిన వచ్చిన వైయ‌స్ జగన్ సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారం నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వైళ్లారు వైయ‌స్ జగన్‌. వైసీపీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తదితరులు జగన్ వెంట నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు జగన్‌ను ఆశీర్వదించి, ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రజా సంకల్పయాత్రను బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించిన జగన్ గురువారం ఉదయం రేణిగుంట చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి తిరుపతిలోని పద్మావతి గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి అలిపిరి చేరుకున్న వైయ‌స్ జగన్‌ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శ్రీవారి దర్శనార్థం అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన బయలుదేరారు. మండపం దగ్గర తొలిమెట్టుకు నమస్కరించిన ఆయన మార్గం మధ్యలో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలుకరిస్తూ ముందుకుసాగిన వైయ‌స్ జగన్ మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. సామాన్య భక్తుడిలా స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించకుకున్న తర్వాత తిరుమలలోని విశాఖ శారదా పీఠం చేరుకున్నారు. అక్కడ వైయ‌స్ జగన్ బృందానికి పూర్ణకుంభంతో స్వాగతం లభించింది. అక్కడ వైయ‌స్ జగన్‌ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వైయ‌స్ జగన్ గురువారం రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు.
శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడపకు చేరుకుని అక్కడ పెద్ద దర్గాను దర్శించుకొని పులివెందులకు వెళ్తారు. అక్కడ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుని అక్కడ తన తండ్రి మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సమాధికి వైయ‌స్ జగన్ నివాళులర్పించనున్నారు.

Share