F2 మూవీ రివ్యూ

ఏపీ టాప్ న్యూస్‌: గురు సినిమా తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకుని వరుణ్ తేజ్‌తో కలిసి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘F2’ సినిమా చేశాడు విక్టరీ వెంకటేష్. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రిలీజైన ఈ సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్ అనిపించుకుందా ? సంక్రాంతి అల్లుళ్ళుగా వచ్చిన వెంకీ – వరుణ్ తేజ్ సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచారా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
F2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. సంక్రాంతి అల్లుళ్లు బాగా నవ్వించారా ?
నటీ నటులు: వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాద, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ప్రగతి, వెన్నెల కిషోర్ తదితరులు
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : దిల్ రాజు
రచన -దర్శకత్వం : అనిల్ రావిపూడి
గురు సినిమా తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకుని వరుణ్ తేజ్‌తో కలిసి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘F2’ సినిమా చేశాడు విక్టరీ వెంకటేష్. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రిలీజైన ఈ సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్ అనిపించుకుందా ? సంక్రాంతి అల్లుళ్ళుగా వచ్చిన వెంకీ – వరుణ్ తేజ్ సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచారా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ :
ఎం.ఎల్.ఎ (రఘుబాబు) దగ్గర పీఏగా వర్క్ చేస్తుంటాడు వెంకీ (వెంకటేష్). పెళ్ళికి రెడీ అయిన వెంకీకి మొగుడిపై పెత్తనం చేసే మనస్తత్వం ఉన్న హారిక( తమన్నా)తో పెళ్లవుతుంది. మొదటి ఆరు నెలలు ఎంతో సంతోషంగా గడిపిన వీరి దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు. అలకలు మొదలవుతాయి. ఈ క్రమంలో హాస్టల్ నుండి వచ్చి అక్క ఇంట్లోనే తిష్ట వేస్తుంది హారిక చెల్లి హనీ (మెహ్రీన్ ఫిర్జాద). ఇక అటు పెళ్ళాం, ఇటు మరదలు పెట్టె టార్చర్‌తో ఇబ్బంది పడుతూ ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు వెంకీ. అదే టైంలో హారికా ఫ్యామిలీ కూడా వెంకీపై విరుచుకుపడటం, దాంతో ఫ్యామిలీ టార్చర్‌ని భరించలేక వెంకీ ఆసనాలు వేసుకుంటూ.. పెళ్ళాంతో కాంప్రమైజ్ అవ్వలేక నానా తంటాలు పడుతుండటం జరుగుతుంది.

తమన్నా చెల్లెలు హనీ (మెహ్రీన్), వరుణ్ (వరుణ్ తేజ్ ) ఒకరితో మరొకరు లవ్‌లో పడతారు. వారిద్దరి లవ్ స్టోరీని వెంకీ, హారిక ఫ్యామిలీ ముందు పెట్టె క్రమంలో అనుకోకుండా వారిద్దరికీ ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతుంది. ఇక అప్పటి నుంచి తమన్నా ఫ్యామిలీ దెబ్బకి వరుణ్ కూడా వెంకీ లాగే భార్య బాధితుడిగా మారతాడు. కాబోయే తోడల్లుళ్ళు కలిసి అక్కా చెల్లెళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. సరిగ్గా హనీతో పెళ్ళికి ముందు ఇద్దరూ కలిసి యూరప్‌కి జంప్ అవుతారు. అలా యూరప్ వెళ్ళిన వెంకీ -వరుణ్‌లకి ఎదురైనా సంఘటనలేంటి ? చివరకి ఈ రెండు జంటలు వారి మధ్య వున్న ఈగో ప్రాబ్లెమ్స్‌ను ఎలా పరిష్కరించుకున్నారు ? ఫైనల్‌గా వెంకీ -వరుణ్‌లు పెళ్ళాలతో మళ్ళీ వారి జీవితాన్ని ఎలా హాయిగా కొనసాగించారు అనేది మిగతా కథ.

నటీనటులు :
కామెడీ టైమింగ్‌కి బ్రాండ్ అంబాసిడర్ పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ టైమింగ్‌తో మంచి కామెడీ పండించాడు. ముఖ్యంగా ఈ సినిమా వెంకీ లేకుండా ఊహించుకోలేం. ప్రతీ కామెడీ సీన్‌లో వెంకీ వందకి వంద మార్కులు అందుకున్నాడు. వెంకీ కామెడీ టైమింగ్ ముందు వరుణ్ తేలిపోయినా.. తన నటనతో పరవాలేదనిపించుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణ యాసతో మంచి కామెడీ క్రియేట్ చేసి క్యారెక్టర్‌కి పెర్ఫెక్ట్ అనిపించాడు వరుణ్. ఇక మొదటిభాగంలో జస్ట్ పరవలేదనిపించినా.. రెండో భాగంలో మాత్రం హరితేజతో కలిసి బాగా నవ్వించాడు రాజేంద్ర ప్రసాద్. ప్రకాష్ రాజ్ కొత్త క్యారెక్టర్‌తో ఎంటర్టైన్ చేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన నటనతో అలరించాడు. అన్నపూర్ణమ్మ, వై విజయ పోటీపడి మరీ నవ్వించారు. ప్రగతి బెస్ట్ క్యారెక్టర్‌తో సినిమాకు ప్లస్ అయ్యింది. వెన్నెల కిషోర్ కామెడీ పండలేదు, కానీ క్లైమాక్స్ మాత్రం కాస్త నవ్వించాడు. సుబ్బరాజు, సత్యం రాజేష్, మిర్చి బాబ్జీ మిగతా నటీనటులందరూ తమ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :
సినిమాకు పర్ఫెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు దేవి. ఎంతో ఫన్, రెచ్చిపోదాం బ్రదర్, గిర్రా గిర్రా సాంగ్స్ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. తన కెమెరా వర్క్‌తో సినిమాకు క్లాస్ టచ్ ఇచ్చి హైలైట్‌గా నిలిచాడు సమీర్. ఎడిటింగ్ బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పర్ఫెక్ట్‌గా కట్ చేసారు. కాసర్ల శ్యాం అందించిన సాహిత్యంతో పాటు శ్రీమణి, బాలాజీ సాహిత్యం కూడా బాగుంది. సినిమాలో వచ్చే కొన్ని కామెడీ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. అనిల్ కాన్సెప్ట్, డైరెక్షన్ అందరినీ ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

మొగుడు- పెళ్ళాం మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, వాటి నుండి జెనరేట్ అయ్యే ఫన్ ప్రేక్షకులను ఎప్పుడూ నవ్విస్తుంది. భార్య భర్తల మధ్య వచ్చే కామెడీని సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే హిట్టు కొట్టడం చాలా ఈజీ కూడా… అప్పట్లో ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘పెళ్ళాం ఊరెళితే’ లాంటి హిట్ సినిమాలే అందుకు ఉదాహరణ. అయితే ఈ కాన్సెప్ట్‌ని మరోసారి పర్ఫెక్ట్‌గా రాసుకొని, దానికి వెంకీ లాంటి పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్న హీరో, వరుణ్ లాంటి మరో యంగ్ హీరోని సెలెక్ట్ చేసుకొని మరీ ఈ సంక్రాంతి బరిలో నిలిచాడు అనీల్ రావిపూడి.

ఇప్పటి రోజుల్లో ఓ సినిమాతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నవ్వించడం కష్టం.. జంధ్యాల, ఈ.వి.వి తర్వాత చాలా మంది దర్శకులు ఈ జానర్ ట్రై చేసినప్పటికీ కొందరే హిట్టు కొట్టగలిగారు. ఈ జెనరేషన్‌లో ఎలాంటి కంపేరిజన్స్ లేకుండా రెగ్యులర్ జోక్స్ వాడకుండా నవ్వించడం మరీ కష్టం. ఆ ఛాలెంజ్‌ని దర్శకుడిగా బాగా డీల్ చేశాడు అనీల్ రావిపూడి. తన మొదటి సినిమా నుండే కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన అనీల్ ఈసారి కమర్షియల్ హంగుల జోలికి వెళ్ళకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీదే ఫోకస్ పెట్టి కడుపుబ్బా నవ్వించాడు. దాదాపు అందరు కమెడియన్లను బాగా వాడుకున్న అనీల్ చాలా సందర్భాల్లో జంధ్యాల, ఈ.వి.వి లను గుర్తుచేసాడు. ముందు నుండి భార్య అంటే భయపెట్టేలా చూపించిన అనీల్ క్లైమాక్స్‌లో మాత్రం భార్య గొప్పతనాన్ని ఎమోషనల్‌గా చెప్పి ఆకట్టుకున్నాడు.

సినిమాలో వెంకీ స్థానంలో మరో హీరోని ఊహించుకోలేం. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను తన భుజాలపై వేసుకుని నడిపించాడు వెంకీ. సినిమా ప్రారంభంలోనే ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాల్లో వెంకీ క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. అప్పటి వెంకీని మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. త్రివిక్రమ్ తర్వాత వెంకటేష్‌కి ఈ రేంజ్ కామెడీ పంచ్ డైలాగ్స్ ఇచ్చి బెస్ట్ అవుట్‌పుట్ తీసుకున్న రైటర్ కం డైరెక్టర్ అనీల్ ఒక్కడేనేమో. కామెడీ పండించే మంచి క్యారెక్టర్ దొరకాలే కానీ దుమ్ము దులిపేస్తానని వెంకటేష్ కూడా మరోసారి నిరూపించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే పెళ్లి చూపుల సన్నివేశం నుండి ఇంటర్వెల్ వరకూ వెంకీ కామెడీకి నవ్వని వారుండరు.

బోరబండ లోకల్ కుర్రాడిగా వరుణ్ బాగానే చేసాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. కాకపోతే వెంకీ కామెడీ టైమింగ్ ముందు మాత్రం నిలవలేకపోయాడు. ఇక మొదటి భాగానికే ప్రేక్షకులకు నవ్వి నవ్వి ఇంక చాలు మా డబ్బుకి న్యాయం జరిగిందనే పరిస్థితి కొస్తారు. ఇక రెండో భాగం, మొదటి భాగం రేంజ్‌లో హిలేరియస్‌గా లేకపోయినా తన స్క్రీన్ ప్లేతో అక్కడక్కడా కామెడీ క్రియేట్ చేసి ఎంటర్టైన్ చేసాడు అనీల్. ఫైనల్‌గా సంక్రాంతి అల్లుళ్ళు భలే నవ్వించారు.

బాట్టం లైన్ : నో ఫ్రస్ట్రేషన్… ఓన్లీ ఫన్

రేటింగ్ : 3 .25 /5

Share