ఓట్ల తొల‌గింపుపై ఢిల్లీకి వైయ‌స్ జ‌గ‌న్‌

ఏపీ టాప్ న్యూస్ : వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ హస్తినబాట పట్టనున్నారు. ఓటర్ లిస్ట్ జాబితాలో అవకతవకలు జరిగాయని, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సర్వేల పేరుతో వైసీపీ సానుభూతి పరుల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించే ప్రయత్నం టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓటర్ లిస్టుల అవకతవకలను ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు అలాగే జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు వైయ‌స్ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సోమవారం ఈసీని కలిసి వైయ‌స్ జగన్ ఫిర్యాదు చెయ్యనున్నారు. దీంతో ఆదివారం సాయంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఢిల్లీ నుంచి మంగళవారం మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా చిత్తూరు వెళ్తారు. చిత్తూరులో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.
ఇకపోతే ఇటీవల కాలంలో సర్వేల పేరుతో వైసీపీ సానుభూతి పరుల పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని వైసీపీ ప్రచారం చేస్తోంది. అందుకు విజయనగరం జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనే ఉదాహరణగా చూపిస్తోంది. విజయనగరం జిల్లాతోపాటు కడప, అనంతపురంతోపాటు పలు జిల్లాలలో సర్వేల పేరుతో పేర్లు తొలగించే కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటించడం, రెండు రోజుల తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టడం ఆసక్తికరంగా మారింది.

Share