నేను..మీరు..అంద‌రికీ ప్ర‌భుత్వాస్ప‌త్రిలోనే వైద్యం

ఏపీ టాప్ న్యూస్‌: “ప్ర‌భుత్వాస్ప‌త్రుల ప‌రిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. అక్క‌డ స‌రైన సౌక‌ర్యాలు ఉండ‌డం లేదు. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాస్ప‌త్రికి పోవాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక రెండేళ్ల‌లో ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌ను ప్ర‌క్షాళ‌న చేస్తాం. ప్ర‌తి ఒక్క‌రూ అక్క‌డికే వెళ్లి వైద్యం చేయించుకునేలా చేస్తాం. నాకు జ్వ‌రం వ‌చ్చినా అక్క‌డికే వెళ్లి వైద్యం చేయించుకుంటా“ అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. అన్న‌పిలుపు కార్య‌క్ర‌మంలో భాగంగా అనంత‌పురంలో త‌ట‌స్థుల‌తో భేటీ అయిన వైయ‌స్ జ‌గ‌న్ పై విధంగా స్పందించారు. ఇంకా ఏమ‌న్నారంటే.. సర్కార్‌ ఆసుపత్రుల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకునేలా వ్యవస్థలో మార్పు తీసుకొస్తామన్నారు.
కాగా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ వృథా అన్నట్లు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, లోకేష్ కనుసన్నల్లో నడిచే మెడాల్ సంస్థకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపరీక్ష కాంట్రాక్టు పనులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వ‌చ్చిన వెంట‌నే విద్య, వైద్య సదుపాయాలు పెంచుతామని జ‌గ‌న్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ఉపాధి హామీ కూలీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత సిగ్గు చేటని, రూ. 20 కోట్ల బకాయిలు తనకే రావాలని సాక్షాత్తు మోహన్‌ బాబు వంటి వారు ఆవేదన చెందుతున్నారరంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు.

Share