నాడు పొగ‌డ్త‌లు..నేడు విమ‌ర్శ‌లా?

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుక‌ప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడుకు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని నాలుగేళ్లు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి ఇప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మోడీ వంటి వ్య‌క్తి ఒక్క‌రు చాల‌ని, దేశం అభివృద్ధిలో ప‌రుగులు పెడుతుంద‌ని చెప్పి ఇప్పుడు ఆయ‌న‌ను విమ‌ర్శించ‌డం చంద్ర‌బాబుకే చెల్లింద‌న్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి స్వాగతం చెప్పని బాబు ఇక సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సిందేన‌న్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు ఏపీకి మోదీ ప్రభుత్వం ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని స్పష్టం చేశారు.
మరోవైపు మార్చి ఒకటిన విశాఖపట్నంలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 19న ఒంగోలులో, 21న రాజమహేంద్రవరంలో అమిత్ షా బహిరంగ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడానికి చంద్రబాబు ఇప్పటికే రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం మోదీ నర్మదా నది నుంచి నీళ్లు, మట్టి తెస్తే చంద్రబాబు ఆనందంగా స్వీకరించారని ఇప్పుడు విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద భోజనాల కాంట్రాక్టర్‌ ఇరిగేషన్‌ మంత్రి బంధువుదేనని వీర్రాజు స్పష్టం చేశారు.

Share