బాబూ.. ఏంటి ఆ పోలిక‌లు?

ఏపీ టాప్ న్యూస్‌: చంద్ర‌బాబు నాయుడికి ఏమైంది? త‌న‌ను తాను గొప్పగా చెప్పుకోవ‌డం ఏంటి? త‌న‌ను తాను పొగుడుకోవ‌డం ఏంటి? అస‌లేమైంది బాబుకు? అంటూ ప్ర‌జ‌లు, రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు. అన్నీ తానే చేశాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల త‌న‌ను తాను మ‌హానుభావుల‌తో పోల్చుకుంటున్నారు. నిన్న జాతిపిత మ‌హాత్మాగాంధీతో పోల్చుకున్న చంద్ర‌బాబు నేడు ఏకంగా త‌న‌ను తాను టంగుటూరు ప్ర‌కాశం పంతుల‌తో పోల్చుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. వైకుంఠపురం బ్యారేజ్ శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు చంద్ర‌బాబు నాయుడు ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే “ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు అయితే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నేనే. ఆయన ప్రకాశం బ్యారేజీ కడితే నేను వైకుంఠపురం బ్యారేజ్‌కు శ్రీకారం చుట్టా. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్‌కి 13.2.1954లో శంకుస్థాపన చేస్తే, నేను వైకుంఠపురం బ్యారేజ్‌కి 13.2.2019లో శంకుస్థాపన చేశా. ప్రకాశం పంతులు శంకుస్థాపన చేసిన రోజే నేను కూడా శంకుస్థాపన చేశా. ఆయన ప్రకాశం బ్యారేజ్‌ని అత్యంత వేగంగా పూర్తి చేశారు. అలాగే నేను కూడా అంతకంటే వేగంగా ఈ బ్యారేజ్‌ని పూర్తి చేస్తా“ అని అన్నారు.
అంతేకాకుండా హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌లో చంద్రబాబు తన హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందంటూ మళ్లీ పాత రికార్డే వేశారు. ‘గతంలో హైదరాబాద్‌ను నాలెడ్జ్‌ సిటీగా అభివృద్ధి చేశానని, 164 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌ రోడ్ నిర్మించామని, హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు సైబరాబాద్‌ను నిర్మించానని చెప్పారు. అమరావతి అంటే దేవతల రాజధాని. ఇక్కడ నివసించే వారు సుదీర్ఘ జీవితాన్ని పొందాలి. అన్ని వసతులతో పాటు నాణ్యమైన జీవనం వారికి అందించాలి. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో అత్యుత్తమ నగరాన్ని అమరావతిలో నిర్మిస్తున్నాం. రైతులకు కూడా వివరించాను. వ్యవసాయం కన్నా ఎక్కువ ఆదాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాను. రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా 34వేల ఎకరాలను సంతోషంగా అమరావతికి ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు.

Share