గెలిచే పార్టీల‌వైపు నేత‌ల చూపు వ‌ల‌స‌లు షురూ!

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది . రాజ‌కీయ నేత‌లంతా జంపింగులు ప్రారంభించేశారు. ప్ర‌జ‌లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో ఏ పార్టీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టే ఆలోచ‌న‌లో ఉన్నారో తెలుసుకుని ఆలోచించి మ‌రీ పార్టీలు మారుతున్నారు. ఏపీలో తాజా ప‌రిణామాలు గ‌మ‌నిస్తే ప్ర‌జ‌లంతా వైసీపీ వైపే ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే అధికార పార్టీ అయిన టీడీపీ నుండి ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీలోకి నేత‌లు వ‌ల‌స‌లు ప్రారంభించారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మేడా మ‌ల్లికార్జున రెడ్డి పార్టీలో చేర‌గా, ఆమంచి కృష్ణ మోహ‌న్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంపీలు కూడా వైసీపీ బాట ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు టీడీపీ ఎంపీలు చాలా రోజులుగా ఆ పార్టీ నేత‌ల‌కు అందుబాటులో లేర‌ట‌. క‌నీసం ఫోన్‌లో కూడా క‌ల‌వ‌డం లేద‌ట‌. వారిద్ద‌రు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది.
ఇందులో అవంతి శ్రీ‌నివాస్ పేరు బ‌హిరంగంగానే విన‌బ‌డుతోంది. ఆయ‌న నేడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లిసే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రో ఎంపీ కూడా అదే బాట‌లో న‌డ‌వ‌నున్న‌ట్టు స‌మాచారం. వీరితో పాటు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మ‌రో టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేర‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వైయ‌స్‌ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి రెండు మూడు రోజుల‌లో వైసీపీలో చేర‌నున్నారట‌. ఇంకా ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు స‌న్నిహితుడైన మ‌రో టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరేందుకు అంతా సిద్దం చేసుకున్నార‌ట‌. అవంతి శ్రీ‌నివాస్ ఇంటివ‌ద్ద టీడీపీ జెండాల‌ను కూడా తొల‌గించార‌ట‌. మునుముందు మ‌రెన్ని ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలిమ‌రి.

Share